తన ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పిన రంగమ్మత్త...!

Sun May 24 2020 18:40:27 GMT+0530 (IST)

Ansuya On About Her First Boy Friend

యాంకర్ అనసూయ.. తెలుగు ప్రేక్షకులుకు ఈ పేరు పరిచయం చేయాల్సిన పనిలేదు. బుల్లితెరపై పలు షోలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ అందాల యాంకరమ్మ. ప్రస్తుతం అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై తన హవా చూపిస్తోంది. యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ భరద్వాజ్ ఇప్పుడు సినిమాల్లో సైతం వరుస అవకాశాలు కొట్టేస్తోంది. సుకుమార్ - రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’లో 'రంగమ్మత్త'గా అందరిని మెప్పించింది. ఆ సినిమాతో అనసూయ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఒకవైపు బుల్లితెరపై పలు షోలు చేస్తూనే మరోవైపు అప్పుడప్పుడు వెండితెరపై మెరిసింది. 'క్షణం' 'ఎఫ్ 2' 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రాల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. విజయ్ దేవరకొండ నిర్మించిన 'మీకుమాత్రమే చెప్తా' సినిమాలో కీలక పాత్ర పోషించింది.వెండితెర బుల్లితెరలపై తనదైన శైలిలో రాణిస్తున్న అనసూయ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటికే పరిమితమై రెగ్యులర్ గా సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులో ఉంటోంది. ప్రేక్షకులకు వినోదాల విందిస్తూ అలరించే ఈ జబర్దస్త్ బ్యూటీ అనసూయ తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. గత రెండు నెలలుగా షూటింగ్స్ లేక ఇంటికే పరిమితమైన ఈ భామ.. తన స్వీయ నిర్బంధం విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలపై స్పందించింది. ఇంస్టాగ్రామ్ వేదికగా నెటిజన్స్ వేసిన ప్రశ్నలన్నింటికీ బదులిస్తూ అనసూయ తన కుటుంబం.. కేరీర్ సంగతులపై ఆసక్తికర సమాధానాలిచ్చింది. బుల్లితెర వెండితెర కెరీర్ హాయిగా సాగిపోతోందని.. పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వస్తే నటించాలని ఉందని తెలిపింది. ఇక తన ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ బాయ్ ఫ్రెండ్.. ఇప్పటికీ భర్తే అని.. ఆయనే లోకమని.. అలాగే భవిష్యత్తులో కూడా ఆయనే తన బాయ్‌ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది. తమ పదో వివాహ వార్షికోత్సవ వేడుకను ఇటలీలో చేసుకుందామని ప్లాన్ చేసామని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని చెప్పింది. కాకపోతే ఇప్పుడు ఒకసారి తిరుమల వెళ్లాలని ఉందని పేర్కొంది.

''మీలాంటి అమ్మాయి నాకు లవర్ గా రావాలని దీవించండి మేడమ్'' అని ఓ నెటిజన్ అడగగా.. దానికి బదులిస్తూ ''అది కొంచెం కష్టం.. ఎందుకంటే నేను సింగిల్ పీస్.. మంచి అమ్మాయి కొంచెం నాలాంటి అమ్మాయి రావాలని ఆశిస్తున్నాను'' అంటూ తనదైన శైలిలో సమాధానం చెప్పింది రంగమ్మత్త. అంతేకాకుండా వాల్యూస్ విషయంలో ఎక్కడా రాజీపడకుండా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ కొనసాగిస్తున్నానని పేర్కొంది. ఎప్పుడైనా సరే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం ఎంతో ముఖ్యమని చెబుతూ వీలైనంత త్వరలో ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని సలహా ఇస్తోంది. ఏదేమైనా మన రంగమ్మత్త స్మాల్ స్క్రీన్ సిల్వర్ స్క్రీన్ మీద మిస్ అయిన ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియా ద్వారా అందిస్తోందని చెప్పవచ్చు.