Begin typing your search above and press return to search.

పవన్ - హరీష్ కాంబోలో మరో రీమేక్ మూవీనా..?

By:  Tupaki Desk   |   7 Oct 2022 1:38 PM GMT
పవన్ - హరీష్ కాంబోలో మరో రీమేక్ మూవీనా..?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత.. రీమేక్ చిత్రాలే తనకు సౌకర్యంగా ఉంటాయని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. 'వకీల్ సాబ్' వంటి రీమేక్ ని కంబ్యాక్ మూవీగా ఎంచుకున్న అగ్ర హీరో.. వెంటనే 'భీమ్లా నాయక్' వంటి మరో రీమేక్ తో వచ్చారు.

దీని కోసం ఒరిజినల్ కథలతో తెరకెక్కే 'హరి హర వీరమల్లు' 'భవదీయుడు భగత్ సింగ్' వంటి సినిమాలను కూడా డిలే చేస్తూ వచ్చారు. ఇక రీమేక్ సినిమాలు చేయొద్దని ఫ్యాన్స్ వేడుకుంటున్న సమయంలో.. 'వినోదయ సీతమ్' వంటి మరో తమిళ్ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవన్.

ఓటీటీలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'వినోదయ సీతమ్' అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి పవన్ కళ్యాణ్ అంగీకారం తెలిపినట్లుగా చాలా నెలలుగా వార్తలు వస్తున్నాయి. మాతృకను డైరెక్ట్ చేసిన సముద్రఖని చేతిలోనే ఈ ప్రాజెక్ట్ బాధ్యతలు పెట్టారు. ఈ విషయాన్ని దర్శకుడు ధ్రువీకరించారు.

పవన్ రీమేక్ సినిమాలో మార్పులు చేర్పులు చేసే బాధ్యత త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకున్నారని.. ఇందులో సాయి ధరమ్ తేజ్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వచ్చింది. దీనికి పవన్ 20 రోజుల కాల్షీట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది.

జీ స్టూడియోస్ సమర్పణలో పీపుల్స్ మీడియా బ్యానర్ లో ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లాల్సి ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైంది. పవన్ కళ్యాణ్ ముందుగా 'వీరమల్లు' సినిమాని పూర్తి చేయాలని భావించడమే దీనికి కారణంగా చెబుతున్నారు.

జనసేనాని తన పాదయాత్రని వాయిదా వేసుకొని తిరిగి వీరమల్లు షూటింగ్ లో పాల్గొనడానికి నిర్ణయం తీసుకోవడంతో.. మళ్లీ 'వినోదయ సితం' రీమేక్ తెరపైకొచ్చింది. అయితే అంతలోనే పవన్ కళ్యాణ్ మరో రీమేక్ స్టోరీని వినడానికి రెడీ అయినట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

తమిళ్ లో ఘనవిజయం సాధించి తెలుగులోకి 'పోలీసోడు' పేరుతో డబ్బింగ్ చేయబడిన 'తేరి' చిత్రాన్ని పవన్ రీమేక్ చేయనున్నట్లు చాలా నెలలుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు దర్శకుల పేర్లు వినిపించగా.. ఇప్పుడు కొత్తగా డైరెక్టర్ హరీష్ శంకర్ పేరు తెర మీదకు వచ్చింది.

పవన్ తో 'గబ్బర్ సింగ్' వంటి రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న హరీష్.. ఆయనతో 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి గత రెండేళ్లుగా ట్రై చేస్తున్నారు. అయితే ఆ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటో తెలియదు కానీ.. ఇప్పుడు 'తేరి' రీమేక్ స్టోరీని వినిపించబోతున్నారని రూమర్స్ వస్తున్నాయి.

ఈ మేరకు అక్టోబర్ 9న పవన్ ను హరీశ్ శంకర్ కలవబోతున్నారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఇప్పటికే పలు రీమేక్స్ ని సక్సెస్ ఫుల్ గా తెలుగులో తీసిన హరీష్.. 'తేరి' స్టోరీని తన స్టైల్ లోకి మార్చినట్లుగా ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. ఇందులో నిజమెంతనేది మరో రెండు రోజుల్లో తెలుస్తుంది.

ఒకవేళ ఇదే నిజమైతే 'వినోదయ సితం' మరియు 'తేరి' రీమేక్స్ లో పవన్ కళ్యాణ్ ముందుగా దేనికి ఓటేస్తారనేది చూడాలి. జనసేన అధినేత ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయ వ్యవహారాలు చూసుకోవాలి కాబట్టి.. రీమేక్ ప్రాజెక్ట్స్ ను ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. కానీ ఫ్యాన్స్ మాత్రం వంద కోట్ల మార్కెట్ ఉన్న హీరో ఇలాంటి రీమేక్స్ చేయడమేంటని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.