KGF 2 ఖాతాలో మరో రేర్ రికార్డ్

Mon May 16 2022 14:04:29 GMT+0530 (IST)

Another rare record on KGF 2

ఇంతకుముందే ఆర్.ఆర్.ఆర్ 50 రోజుల పోస్టర్ వేయడం ఒక సంచలనంగా మారింది. ఇంతలోనే KGF 2 మరో అరుదైన ఫీట్ ని సాధించింది. ఈ సినిమా వసూళ్ల హవా హిందీ బెల్ట్ లో ఏమాత్రం తగ్గడం లేదన్నది తాజా రిపోర్ట్. KGF చాప్టర్ 2 బాక్స్ ఆఫీస్ పరంగా మరో అరుదైన రికార్డును అందుకుంది. 2022లో ఐదవ వారాంతంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డులకెక్కింది.



రాకింగ్ స్టార్ యష్ నటించిన KGF - చాప్టర్ 2 నాలుగు వారాల క్రితం విడుదలైంది. అప్పటి నుండి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేని హవా సాగిస్తోంది. హిందీ మార్కెట్లో 100 కోట్లు.. రూ. 200 కోట్ల మార్క్ నుంచి కేజీఎఫ్ 2 రూ. 300 కోట్ల మార్క్ ని అత్యంత వేగంగా అందుకుంది. రికార్డు సమయంలో 400 కోట్ల మార్క్ కి చేరుకుని ఇప్పుడు ఐదవ వారాంతంలో నడుస్తున్న ఈ చిత్రం దాని కలెక్షన్లు స్థిరంగా ఉన్నాయని ప్రూవ్ చేసింది.

బాక్సాఫీస్ రిపోర్ట్ ప్రకారం.. KGF - చాప్టర్ 2 ఐదవ-వారాంతంలో అత్యుత్తమ వసూళ్లను సాధించింది. అదే సమయంలో 2022లో ఇంతకు ముందు విడుదల చేసిన వాటితో పోల్చి చూడగా.. చివరి రోజు 6.35 కోట్ల వసూళ్లను సాధించింది.  KGF 2 చిత్రం 2022లో అత్యధిక ఐదవ వారాంతపు గ్రాసర్ గా నిలిచింది. వాస్తవానికి KGF 2 రికార్డుల పరంగా RRR  రికార్డుల్ని అధిగమించగలిగింది. ఆర్.ఆర్.ఆర్ ఐదో వారంలో రూ. 3.32 కోట్లు వసూలు చేయగా.. ది కాశ్మీర్ ఫైల్స్ రూ. 2.50 కోట్లు వసూలు చేసింది.  ఆసక్తికరంగా KGF - అధ్యాయం 2  వసూళ్ల హవా గత రెండు వారాలలో తెరపైకి వచ్చిన కొత్త విడుదలల వల్ల ప్రభావితం కాలేదు. థియేటర్లలో ప్రేక్షకుల మొదటి ఎంపికగా ఇప్పటికీ కొనసాగుతోంది.

KGF – చాప్టర్ 2 ఐదవ వారంలో దాని బాక్సాఫీస్ రన్ ను ఉత్తమంగా కొనసాగించింది. కలెక్షన్లు ఇప్పటికే రూ. 427.05 కోట్లు. ఈ వారం చివరి నాటికి 450 కోట్ల మార్క్ ని అందుకుంటుందని అంచనా.  బాహుబలి 2  రికార్డును అధిగమించాలంటే ఇంకా 60 కోట్లు పైగా వసూలు చేయాల్సి ఉంటుంది.

2022 టాప్ ఐదవ వారాంతపు గ్రాసర్స్ ఇవీ..
KGF - చాప్టర్ 2 - రూ. 6.35 కోట్లు
RRR - రూ. 3.32 కోట్లు
కాశ్మీర్ ఫైల్స్ - రూ. 2.50 కోట్లు

బాలీవుడ్ సినిమాలు వెలవెల

ఈ చిత్రం వారాంతంలో రణవీర్ జయేష్ భాయ్ చిత్రం ఫ్లాట్ ట్రెండ్ ను చూపింది. శుక్రవారంతో పోల్చితే ఆదివారం కలెక్షన్లు తగ్గే అవకాశం కూడా ఉందిట. ఎందుకంటే అనేక ప్రాపర్టీలలో నైట్ షోలు రద్దు చేసారని సమాచారం. ఇది రణవీర్ సినిమాకి ప్రేక్షకుల నుండి తిరస్కరణకు స్పష్టమైన సంకేతం అని చెబుతున్నారు. జయేష్భాయ్ జోర్దార్ జీవితకాల మొత్తం రూ. 17 నుండి 19 కోట్లు మాత్రమే.