Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ సౌత్ నుంచే సిస‌లైన పాన్ ఇండియా మూవీ!

By:  Tupaki Desk   |   26 Jun 2022 3:30 AM GMT
మ‌ళ్లీ సౌత్ నుంచే సిస‌లైన పాన్ ఇండియా మూవీ!
X
ఈ ఏడాది పాన్ ఇండియా మార్కెట్లో సౌత్ హ‌వా కొన‌సాగుతోంది. పుష్ప‌- ఆర్.ఆర్‌.ఆర్- కేజీఎఫ్ 2 సంచల‌న విజ‌యాలు సాధించాయి. బాక్సాఫీస్ విజ‌యాల‌తో పాటు క్రిటిక్స్ ప్ర‌శంస‌లు అందుకున్న చిత్రాలివి. ఇక బాలీవుడ్ వ‌రుస ప‌రాజ‌యాల నుంచి బ‌య‌ట‌ప‌డి పాన్ ఇండియా మార్కెట్లో స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతున్నా ఆ క‌ల‌ ఫ‌లించ‌డం లేదు.

అమీర్ ఖాన్- షారూక్ ఖాన్- అక్ష‌య్ కుమార్- ర‌ణ‌బీర్ లాంటి హీరోలు సీరియ‌స్ గా ప్ర‌య‌త్నిస్తున్నా పాన్ ఇండియా మార్కెట్లో ఎంత వ‌ర‌కూ రాణిస్తార‌న్న దానిపై సందేహాలున్నాయి. సౌత్ లో వీళ్ల ప‌ప్పులేవీ ఉడికేట్టు క‌నిపించ‌డం లేదు. ఇంత‌లోనే సౌత్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన విక్ర‌మ్ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది. హిందీ ఆడియెన్ కూడా విక్ర‌మ్ ని బాగా రిసీవ్ చేసుకున్నారు.

ఈ సినిమా త‌ర్వాత కూడా మ‌రో త‌మిళ చిత్రం పాన్ ఇండియా అప్పీల్ తో మెప్పించేందుకు వ‌స్తోంది. నిజానికి రెగ్యుల‌ర్ మ‌సాలా కంటెంట్ తో కాకుండా స్పేస్ నేప‌థ్యంలో ఒక సైంటిస్ట్ జీవిత‌ క‌థ‌తో వ‌స్తున్న ఈ సినిమాపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

ఆర్.మాధవన్ నటించిన `రాకెట్రీ: నంబి ఎఫెక్ట్` అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇది ఇస్రో మాజీ శాస్త్రవేత్త .. ఏరోస్పేస్ ఇంజనీర్ అయిన నంబి నారాయణన్ జీవిత‌క‌థ‌ ఆధారంగా రూపొందించిన బయోపిక్. జూలై 1న ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది. ఇందులో మాధవన్ టైటిల్ పాత్రలో నటించడమే కాకుండా దర్శకుడిగానూ పరిచయమ‌వుతున్నాడు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

సీబీఎఫ్ సీ UA సర్టిఫికేట్ ఇచ్చింది. మూవీ రన్ టైమ్ 2 గంటల 37 నిమిషాలు (157 నిమిషాలు). ఈ సినిమా తమిళం- తెలుగు- కన్నడ- మలయాళం- హిందీ- ఇంగ్లీష్ భాషల్లో విడుదలవుతోంది. తమిళం స‌హా దక్షిణ భారత వెర్షన్లలో సూర్య ఓ కీల‌క‌ పాత్రను పోషించగా.. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ హిందీ - ఇంగ్లీష్ వెర్షన్లలో ఆ పాత్రను పోషించాడు. సామ్ సిఎస్ సంగీతం అందించిన `రాకెట్రీ: నంబి ఎఫెక్ట్` లో సిమ్రాన్ - రవి రాఘవేంద్ర ఇత‌ర ముఖ్యమైన పాత్రలు పోషించారు. రెడ్ జెయింట్ మూవీస్ ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేస్తోంది.

నిజానికి వైవిధ్యం ప‌రంగానూ సౌత్ నుంచే వెరైటీ కంటెంట్ థియేట‌ర్ల‌లోకి వస్తోంది. పుష్ప‌- ఆర్.ఆర్‌.ఆర్- కేజీఎఫ్ 2- విక్ర‌మ్ లాంటి చిత్రాలు వేటిక‌వే ప్ర‌త్యేకం. ఈ సినిమా క‌థాంశాలు ఒకదానితో ఒక‌టి పోలిక లేనివి. ఇప్పుడు వ‌స్తున్న రాకెట్రీ కూడా పూర్తి భిన్న‌మైన క‌థ‌తో వ‌స్తోంది. ఒక సైంటిస్ట్ కం ప్రొఫెస‌ర్ జీవిత‌క‌థ‌తో సినిమా కాబ‌ట్టి అటు హిందీ ఆడియెన్ కి ఈ సినిమా న‌చ్చేందుకు ఆస్కారం ఉంద‌నడంలో ఎలాంఇ సందేహం లేదు. ఉత్త‌రాది వారికి మ్యాడీ సుప‌రిచితుడు కాబ‌ట్టి అది మూవీకి పాన్ ఇండియా అప్పీల్ తెచ్చింది.