#జబర్ధస్త్ హీరో.. గెటప్ శీను టైమ్ స్టార్ట్

Sat Nov 21 2020 21:30:26 GMT+0530 (IST)

Another 'Jabardasth' Comedian Turns Into A Hero!

బుల్లితెరపై ఎంతో మందికి అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేసిన షోగా జబర్ధస్త్ కి ప్రత్యేక రికార్డ్ ఉంది. మాస్ కి వందశాతం ట్రీటిచ్చే బుల్లితెర కార్యక్రమంగా జబర్ధస్త్ పాపులరైంది. ఈ వేదికపై ఎంతో మంది సినీనేపథ్యం లేని ప్రతిభావంతులు ఉపాధిని పొందారు. ఇందులో కొందరు కమెడియన్లుగా.. హీరోలుగా అవకాశాలు అందుకుని చక్కని కెరీర్ ని మలుచుకోవడం నిరంతరం చర్చకొస్తోంది.జబర్ధస్త్ ఆర్టిస్టుల్లో ఇప్పటికే పలువురు హీరోలుగా రాణించారు. ధన్ రాజ్.. షకలక శంకర్ .. చంద్ర తదితరులు హీరోలుగా లక్ చెక్ చేసుకున్నారు. ఇప్పుడు గెటప్ శ్రీను వంతు.  

గెటప్ శ్రీను హీరోగా `రాజు యాదవ్` సినిమాని శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఐఐటీ మద్రాస్ లో ఇంటర్నేషనల్ స్క్రీన్ రైటింగ్ కోర్స్ చేసి విన్సెంట్ ఫెరర్ అనే స్పానిష్ ఫిల్మ్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా.. అనంతరం తెలుగులో ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగుల రూపొందించిన నీది నాది ఒకే కథ -విరాటపర్వం చిత్రాలకు చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన కృష్ణమాచారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సాయి వరుణ్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంకిత్ కరత్ ఈ చిత్రంలో కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ సాగర్ కె. చంద్ర క్లాప్ నిచ్చారు. డైరెక్టర్ వేణు ఊడుగుల.. ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ సంయుక్తంగా స్క్రిప్టును దర్శకుడు కృష్ణమాచారికి అందజేశారు.

ఒక పట్టణం బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ చిత్రం సహజసిద్ధమైన పాత్రలతో ఆకట్టుకుంటుందని కృష్ణమాచారి తెలిపారు. కమర్షియల్ హంగులకు దూరంగా వాస్తవిక సమాజంలో మనం చూసే ఎన్నో పాత్రలకు.. ఘటనలకు రిప్రజెంటేషన్ లా ఉంటుందని తెలిపారు.  సగటు కుటుంబంలోని వైరుధ్య మనస్తత్వాలు.. వారి ఊహలు.. కోరికలు..జీవిత ప్రయాణంపై సినిమా ఇది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో గెటప్ శ్రీను నటిస్తున్నారు. అర్జున్ రెడ్డి.. కబీర్ సింగ్ లాంటి హిట్ సినిమాలకు సంగీతం సమకూర్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ రాజు యాదవ్ కు స్వరాలు అందిస్తున్నారు. డిసెంబర్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతామని నిర్మాత ప్రశాంత్ రెడ్డి తెలిపారు.