Begin typing your search above and press return to search.

మ‌రో చిత్ర‌పురి కాల‌నీకి ఇదిగో అంకురార్ప‌ణ‌..!

By:  Tupaki Desk   |   6 Dec 2022 12:30 PM GMT
మ‌రో చిత్ర‌పురి కాల‌నీకి ఇదిగో అంకురార్ప‌ణ‌..!
X
హైద‌రాబాద్ గ‌చ్చిబౌళికి కూత‌వేటు దూరంలో డా.ఎం.ప్ర‌భాక‌ర్ రెడ్డి చిత్ర‌పురి కాల‌నీని నిర్మించిన సంగ‌తి తెలిసిందే. దివంగ‌త‌ న‌టుడికి చెందిన దాదాపు 32 ఎక‌రాల్ని దాన‌మివ్వ‌గా అందులో కొన్ని ఎక‌రాల్లో టాలీవుడ్ 24 శాఖ‌ల కార్మికుల కోసం చిత్ర‌పురి కాల‌నీ లాంటి ప్ర‌తిష్ఠాత్మ‌క గృహ‌స‌ముదాయాన్ని నిర్మించి ఇచ్చారు. ఇంకా పెండింగ్ లో ఉన్న కార్మికుల‌కు కూడా చిత్ర‌పురిలో సొంతింటి క‌ల సాకార‌మ‌వుతుంద‌ని ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నా అది సాధ్య‌ప‌డ‌లేదు. అయితే ఇప్పుడు జూ.ఆర్టిస్టులు .. టెక్నీషియ‌న్ల‌కు సొంతింటి క‌ల సాధ్య‌ప‌డుతుందంటూ ఒక ప్ర‌చారం ఫిలింన‌గ‌ర్ లో ఊపందుకుంది. అయితే ఇది నిజ‌మా? అన్న‌ది ఆరా తీస్తే షాక్ త‌గిలే విష‌యం తెలిసింది.

మ‌రో చిత్ర‌పురి కాల‌నీ నిర్మాణం ఇప్ప‌టికే పూర్త‌యింది. అయితే అది మ‌న హైద‌రాబాద్ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన‌ది కాద‌నేదే ఈ షాకింగ్ వార్త‌. సినిమా టెక్నీషియన్లు- జూనియర్ ఆర్టిస్టులు- రిటైర్డ్ నటీనటులు ఉచిత గృహాలను పొందాలనుకుంటే ధ‌ర‌కాస్తు చేసుకోవాల్సిందిగా ఇంత‌కుముందే ఒక ప్ర‌క‌ట‌న ప్ర‌భుత్వం నుంచి జారీ అయ్యింది.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సినీ కళాకారులు- సాంకేతిక నిపుణుల కోసం పదివేల ఎనభై ఇళ్లను నిర్మిస్తున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే హౌసింగ్ స్కీమ్ మహారాష్ట్రలోని వంగనిలోని శేలు అనే ప్రాంతంలో రూపుదిద్దుకుంది. ఇక్కడ భారతీయ సినిమా మొదటి చిత్రం రాజా హరిశ్చంద్రతో బహిరంగ షూటింగ్ ప్రారంభమైందని చెబుతారు. అలాంటి ప‌విత్ర‌మైన గ‌డ్డ‌పై ఇలాంటి బృహ‌త్త‌ర ప్రాజెక్టును ముంబై ప‌రిశ్ర‌మ కోసం అంకిత‌మివ్వ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) - పాధ్యే గ్రూప్ కు చెందిన అంకుర్ పాధ్యే సహాయంతో ప్రధాన మంత్రి ఆవాసీ యోజన కింద సినీ కార్మికుల కోసం 10080 ఇళ్లు ఇక్కడ నిర్మిస్తున్నారు. ఇందులో మొదటి దశలో 522 ఇళ్లు నిర్మించనున్నారు. ఈ టవర్ 16 అంతస్తులను క‌లిగి ఉంటుంది. ఇందులో లిఫ్ట్- మల్టీ పర్పస్ హాల్ స‌హా అనేక ఇతర సౌకర్యాలు ఉంటాయి.

ఈ హౌసింగ్ స్కీమ్ ప్రత్యేకత ఏమిటంటే.. ప్రధాన గేటుకు దాదాసాహెబ్ ఫాల్కే భార్య సరస్వతీ బాయి ఫాల్కే పేరు పెట్టడం దివంగ‌తులైన వారికి వారి కుటుంబానికి గౌర‌వంగా భావిస్తున్నారు. ఈ `రెరా` నమోదిత గృహాల తొలి ద‌శ శిఖ‌ర స‌ముదాయాన్ని చూడటానికి ముంబై నుండి వేలాది మంది సినీ కార్మికులు ఈరోజు ఆ చోటుకు చేరుకున్నారు.

సినిమా కార్మికులకు ఇళ్లు అందించడం తన తండ్రి కల అని బిల్డర్ అంకుర్ పాధ్యే ఈ సంద‌ర్భంగా మీడియాకు చెప్పారు. ఇందులో FWICE- అమర్ జిత్ సింగ్- మాజీ లేబర్ కమిషనర్ సావంత్ సాహెబ్ కృషి కూడా చాలా ముఖ్యమైనది. గతంలో షోలాపూర్ లో బీడీ కార్మికులకు తన తండ్రి కేవలం రూ.60 వేలకే ఇళ్లు ఇచ్చారని అంకుర్ పాధ్యే ఈ సంద‌ర్భంగా ఒక ప్ర‌కట‌న‌లో చెప్పారు. ఈ హౌసింగ్ పథకం మొదటి దశ ఇప్ప‌టికే నిర్మాణంలో ఉంది. ఒకటిన్నర సంవత్సరాలలో పూర్తవుతుంది. 32065 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా కలిగిన ఈ ఇళ్లు భూకంపాన్ని సైతం తట్టుకోగలవు.