Begin typing your search above and press return to search.

అప్పటి అందమైన ప్రేమకథకు ఇప్పుడు సీక్వెలా ?

By:  Tupaki Desk   |   16 Oct 2021 12:30 AM GMT
అప్పటి అందమైన ప్రేమకథకు ఇప్పుడు సీక్వెలా ?
X
బాలీవుడ్ తెరపై భారీ ప్రేమకథలు ఎన్నో రాజ్యం చేశాయి. ప్రేమనేది ఆరాటపడి అందుకునేది కాదు .. పోరాటం చేసి గెలుచుకునేదే అనే విషయాన్ని కొన్ని ప్రేమకథలు చాటిచెప్పాయి. అలా ప్రేక్షకుల హృదయ సింహాసనాన్ని అధిష్టించిన ప్రేమకథలలో 'గదర్ ఏక్ ప్రేమ్ కథ' ఒకటిగా కనిపిస్తుంది. సన్నీడియోల్ - అమీషా పటేల్ నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమాకి, అనిల్ శర్మ దర్శకత్వం వహించాడు. 2001లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో విజయవిహారం చేసింది.

కథ .. కథా నేపథ్యం .. మాటలు .. పాటలు .. పాత్రలను మలిచిన తీరు ఈ సినిమాను విజేతగా నిలబెట్టాయి. అటు సన్నీడియోల్ కెరియర్లోను .. ఇటు అమీషా పటేల్ కెరియర్లోను ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచింది. ఇప్పటికీ ఈ కథను ప్రేక్షకులు మరిచిపోలేదు. ఎక్కడ ఆ సినిమా పాటలు వినిపించినా ఆ కథకు కనెక్ట్ అవుతూనే ఉంటారు. ఈ సినిమాలో కథానాయకుడు దేశవిభజన సమయంలో పాకిస్థాన్ లో ఉన్న తన భార్యాబిడ్డలను తన దేశానికి తీసుకురావడానికి చేసిన పోరాటమే ఈ కథ.

ఇక వైపున భార్యాబిడ్డల పట్ల ప్రేమ .. మరో వైపున దేశభక్తి. యాక్షన్ .. ఎమోషన్ పాళ్లు పుష్కలంగా ఉన్న కథ ఇది. అందువలన ప్రేక్షకులు ఈ కథకి వెంటనే కనెక్ట్ అయ్యారు. తెరపై ఒంటరిగా పోరాడుతున్న కథానాయకుడికి తమవంతు సాయం చేయాలని తపించేలా ఆ కథలో ప్రేక్షకులు ఇన్వాల్వ్ అయ్యారు. అంతలా ఈ సినిమా కదిలించివేసింది కనుకనే, వసూళ్ల వర్షం కురిసింది. ఆ తరువాత నుంచి ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందనే టాక్ వినిపిస్తూనే వచ్చింది. ఎప్పటికపుడు తెరపైకి వస్తూనే, చప్పున మబ్బుల చాటుకు జారిపోతూ వచ్చింది.

ఇక ఈ సినిమాకి సీక్వెల్ రాదని అభిమానులు ఫిక్స్ అయిన తరువాత, ఉందంటూ మేకర్స్ నుంచి తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది. 'గదర్ 2' టైటిల్ తో ఈ సినిమా ఉంటుందని చెప్పారు. 'గదర్' ను తెరకెక్కించిన అనిల్ శర్మనే సీక్వెల్ ను రూపొందించనున్నాడు. సన్నీడియోల్ - అమీషా పటేల్ ఇద్దరూ ఈ సీక్వెల్లో చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం సన్నీడియోల్ ఫామ్ లో లేడు. అమీషా పటేల్ నటనకు దూరంగా ఉంది. దర్శకుడిగా అనీల్ శర్మ హిట్ అనే మాట వినేసి చాలా కాలమే అయింది. ఇలాంటి పరిస్థితుల్లో సీక్వెలా? అని అంతా నోరెళ్లబెడుతున్నారు. అయితే కథ ఎక్కడ మొదలవుతుంది? కొత్త పాత్రల ప్రాధాన్యత ఎంతవరకూ? అనే విషయంలో స్పష్టత వస్తే ఆశలు పెట్టుకోవచ్చని మరికొందరు అంటున్నారు.