ఫస్ట్ టైం తన సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన అనిల్ రావిపూడి..!

Wed May 25 2022 09:58:57 GMT+0530 (IST)

Anil Ravipudi breaks his sentiment for the first time

టాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుడిగా రాణిస్తున్నారు అనిల్ రావిపూడి. 'పటాస్' తో జర్నీ మొదలుపెట్టి.. 'సరిలేరు నీకెవ్వరు' వరకూ వరుస విజయాలతో దూసుకుపోతూ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిపించుకున్నారు. ఇప్పుడు 'ఎఫ్ 3' సినిమాతో బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు.అయితే 'ఎఫ్ 3' మూవీ విషయంలో దర్శకుడు తొలిసారిగా తన సెంటిమెంటును బ్రేక్ చేసాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించే ప్రతి చిత్రంలో అతని మునుపటి సినిమా హీరోయిన్ తో ఐటెమ్ సాంగ్ లో డ్యాన్స్ చేయించడమో.. స్పెషల్ అప్పీరియన్స్ ఇప్పించడమో చేస్తుంటాడు. లేదా లాస్ట్ మూవీ హీరోయిన్ నే కంటిన్యూ చేస్తుంటారు.

'పటాస్' హీరోయిన్ శృతి సోధితో 'సుప్రీమ్' సినిమాలో ఐటమ్ సాంగ్ చేయించారు అనిల్ రావిపూడి. అలానే తన తదుపరి సినిమా 'రాజా ది గ్రేట్' లో 'సుప్రీమ్' హీరోయిన్ రాశీ ఖన్నాను ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసేలా చేశారు. ముందు సినిమాలో నటించిన మెహరీన్ ను 'ఎఫ్ 2' చిత్రంలో ఒక హీరోయిన్ గా తీసుకున్నారు.

ఇదే క్రమంలో 'ఎఫ్ 2' హీరోయిన్ తమన్నా భాటియాతో తన నెక్స్ట్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు' లో స్పెషల్ నంబర్ లో ఆడిపాడేలా చేశారు అనిల్. ఈ సెంటిమెంట్ ప్రకారం 'ఎఫ్ 3' చిత్రంలో రష్మిక మందన్నాతో ఐటమ్ సాంగ్ చేయించాలి. కానీ దాన్ని బ్రేక్ చేస్తూ రష్మిక కు బదులుగా పూజా హెగ్డే తో స్పెషల్ సాంగ్ చేయించారు.

కాకపోతే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ప్రత్యేక గీతంలో నర్తించిన తమన్నా.. ఇప్పుడు 'ఎఫ్ 3' సినిమాలో ఒక హీరోయిన్. ఈ విధంగా చూసుకుంటే మాత్రం అనిల్ రావిపూడి సెంటిమెంటును కొనసాగిస్తున్నారనే అనుకోవాలి. మరి త్వరలో నందమూరి బాలకృష్ణతో దర్శకుడు చేయబోయే చిత్రంలో తమన్నా - మెహరీన్ - సోనాలీ చౌహాన్ - పూజా హెగ్డేలలో ఎవరినైనా భాగం చేస్తారేమో చూడాలి. ఎందుకంటే వీరంతా 'ఎఫ్ 3' లో నటించారు.

కాగా డబుల్ బ్లాక్ బస్టర్ 'F 2' ఫ్రాంచైజీలో విక్టరీ వెంకటేష్ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన మల్టీస్టారర్ ''ఎఫ్ 3''. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కు రెడీ అయింది.

మే 27న ఈ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైనర్ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. మరి 'ఎఫ్ 3' మూవీతో అనిల్ రావిపూడి విజయాల పరంపర కొంసాగిస్తారో లేదో చూడాలి.