వైజాగ్ టాలీవుడ్ కి 368 ఎకరాలు కేటాయింపు!

Tue Jan 21 2020 19:30:19 GMT+0530 (IST)

Andhra Govt Allotment Land For Film Industry in Visakhapatnam

వైజాగ్ రాజధాని ప్రస్తుతం జాతీయ స్థాయిలో సెన్సేషనల్ టాపిక్. పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ధ్యేయంతో యువ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఈ మహాయజ్ఞం గత రెండు రోజులుగా పూర్తి క్లారిటీతో ఓ కొలిక్కి వస్తున్న సంగతి తెలిసిందే. విశాఖనే పాలనా రాజధానిని చేసేందుకు సీఎం జగన్ సిద్ధమై అసెంబ్లీ సమావేశాల్లో అధికారికంగా ప్రకటించారు.ఇక రాజధాని నిర్మాణానికి భవంతులు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఆ మేరకు ప్రభుత్వంపై అదనపు భారం పడదన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెసయ్యారు. రాజధాని పేరుతో గ్రాఫిక్స్ స్కీమ్ ఏదీ లేదు కాబట్టి ఇక స్పష్ఠమైన అజెండాతో జగన్ ముందుకు సాగనున్నారని అర్థమవుతోంది. పనిలో పనిగా వైజాగ్ టాలీవుడ్ గురించి సినీపరిశ్రమ ప్రముఖుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. విశాఖ రాజధానికి అనుసంధానంగా సరికొత్త టాలీవుడ్ ని నిర్మించాలన్న సంకల్పాన్ని ఇప్పటికే యువ ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేశారని పర్యాటక మంత్రి.. కాబోయే ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖ ఉత్సవ్ లో ప్రకటించారు.  

90 శాతం సినిమా షూటింగులు జరిగేది విశాఖ- అరకు బెల్ట్ లోనే కాబట్టి మరో కొత్త టాలీవుడ్ ని ఇక్కడే నెలకొల్పి విస్త్రతంగా ఉపాధిని పెంచే ప్రయత్నాలు చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. అంతేకాదు విశాఖ బీచ్ పరిసరాల్లోని రామానాయుడు స్టూడియోస్ కి చేరువగా సినీపరిశ్రమకు ఇంతకుముందు భూములు కేటాయించారు. అక్కడే ఫిలింఛాంబర్ సహా నిర్మాతల మండలి సెటప్ కోసం భవంతికి పునాది రాయి వేశారు. అయితే అనూహ్యంగా రకరకాల రాజకీయ కారణాలతో ఆ పనిని వాయిదా వేశారు. విశాఖ పరిసరాల్లో టాలీవుడ్ నెలకొల్పేందుకు అప్పట్లో భూములు కేటాయిస్తూ జీవోని జారీ చేసి అటుపై దానిని లైట్ తీస్కున్నారు. అయితే ఇప్పుడు ఆ భూములకు సంబంధించిన చర్చా మరోసారి వేడెక్కిస్తోంది. ఇటీవల మా అసోసియేషన్ 2020 డైరీ ఆవిష్కరణ వేడుకలో సీనియర్ రచయిత పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ విశాఖ పరిసరాల్లో ప్రభుత్వం 368 ఎకరాల స్థలం సినీపరిశ్రమకు కేటాయించిందని వెల్లడించారు. అలాగే వైజాగ్ లో సినీపరిశ్రమ ఏర్పాటు విషయం వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి అడిగానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ``వన్ టు వన్ కూచుని మాట్లాడాం అన్నా.. మీరే చెప్పండి ఎలా చేద్దాం!`` అని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రోత్సాహకంగా మాట్లాడారని మెగాస్టార్ అనడంతో ఇప్పటికే వైజాగ్ టాలీవుడ్ పై చాలావరకూ క్లారిటీ వచ్చేసింది. ఇక విశాఖలో మెగా స్టూడియోల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు సినీపరిశ్రమకు ఇది శుభసూచికం.. సీఎం జగన్ సానుకూల ధృక్పథంతో టాలీవుడ్ పై స్పందించారు అని పరిశ్రమ వర్గాల్లో వాడి వేడిగా చర్చ సాగుతోంది. ఇక మరో కొత్త పరిశ్రమను స్థాపించి ఏపీకి గ్లామర్ పెంచాలన్న డిమాండ్ ఊపందుకుంది. అందుకు సినీపరిశ్రమ ప్రముఖులు సైతం ఆసక్తిగా ఉన్నారన్న చర్చా సాగుతోంది.