డ్రెస్సింగ్ పై కామెంట్స్ చేసిన కోట పై ఫైర్ అయిన యాంకర్ అనసూయ

Mon Oct 18 2021 21:33:31 GMT+0530 (IST)

Anchor Anasuya Fires On Kota Srinivasa Rao

ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు.. అప్పుడప్పుడు వివాదాలు కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు. తాజాగా యాంకర్ అనసూయ భరద్వాజ్  ను ఉద్దేశించి కోట చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీ అయ్యాయి. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన కోట.. అనసూయ డ్రెస్సింగ్ స్టైల్ పై కామెంట్స్ చేశారు. ''యాంకర్ అనసూయ మంచి నటి మంచి డ్యాన్సర్ మంచి పర్సనాలిటీ.. చక్కటి ఎక్సప్రెషన్.. ఇలా అన్నీ ఆమెకు ఉన్నాయి. అలాంటి ఆవిడ టీవీ ప్రోగ్రామ్స్ లో వేసుకునే డ్రెస్ ఎందుకనో నాకు నచ్చదు. అలాంటి అందమైన అమ్మాయి ఎలా ఉన్నా జనాలు చక్కగా చూస్తారు. అలాంటి బట్టలు వేసుకోవాల్సిన పనిలేదు. ఆమె మీద గౌరవం ఉంది కాబట్టే డ్రెస్సింగ్ మారిస్తే బావుంటుందని అంటున్నాను'' అని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు.కోట శ్రీనివాసరావు యాంకర్ అనసూయ ను పొగిడినప్పటికి.. వస్త్రధారణ మీద చేసిన కామెంట్స్ పై నెటిజన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా అనసూయ భరద్వాజ్ స్పందించారు. కోట శ్రీనివాసరావు పేరుని ప్రస్తావించకుండానే ట్విట్టర్ వేదికగా ఆయన మాట్లాడిన తీరుని విమర్శించారు. ''ఓ సీనియర్ యాక్టర్ నాపై కొన్ని కామెంట్స్ చేశారనే విషయం ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. ఆయన నేను వేసుకునే డ్రెస్సింగ్ గురించి మాట్లాడారు. అలాంటి అనుభవమున్న వ్యక్తి అలా దిగజారి మాట్లాడటం అనేది నాకు చాలా బాధ కలిగించింది. ఒకరు ధరించే దుస్తులు వారి వ్యక్తిగతం అలానే వృత్తిపరమైన పరిస్థితులను అనుసరించినవి కూడా. అది వారి వ్యక్తిగత విషయం. కానీ సోషల్ మీడియా అలాంటి వార్తలను ప్రచారం చేస్తుంది. అలాంటి సీనియర్ నటుడు మందు తాగుతూ అధ్వానమైన దుస్తులను ధరించి ఎలా పేరు తెచ్చుకున్నాడో అర్థం కాలేదు. ఆయన స్క్రీన్ మీద స్త్రీలను కించపరిచిన సన్నివేశాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ అలాంటి వార్తలను సోషల్ మీడియా ఎందుకు పట్టించుకోదనేది ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది'' అని అనసూయ పేర్కొన్నారు.

''పెళ్లి చేసుకుని పిల్లలను కలిగి ఉండి సిల్వర్ స్క్రీన్ పై నటీమణులతో రొమాన్స్ చేస్తూ.. షర్టులు లేకుండా తమ ఫిజిక్ ని చూపించే ఇలాంటి స్టార్స్ ని ఎవరూ ఎందుకు ప్రశ్నించరు? నేను పెళ్లైన ఇద్దర పిల్లలున్న మహిళను. నా వృత్తిలో విజయాన్ని సాధించడానికి ఎంతో కష్టపడుతున్నాను. మీరు మీ అభిప్రాయాలను ప్రజలకు చెప్పడం కంటే మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి ప్రయత్నించాలి'' అని అనసూయ ట్వీట్ చేసింది.

ఈ క్రమంలో అనసూయ మరో ట్వీట్ చేస్తూ "నేను మీ కోసం పొగమంచును క్లియర్ చేస్తాను. గతంలో లేదా ఇప్పుడు మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలి అని మాట్లాడుతున్న వారందరూ తమకు మార్గదర్శకత్వం/నియంత్రణ నేర్పించడం కంటే చాలా కలుషితమయ్యారు. వాళ్లే ఈ డ్రెస్సింగ్ కోడ్ లను మహిళలపై విధించారు. వారు తమ ఆలోచనలను కప్పిపుచ్చుకోవడానికి మహిళలను అవమానిస్తారు. నేటి పురుషులు మరింత తార్కికంగా మరియు ధైర్యంగా తెలివిగా నీతిమంతులుగా ఉన్నారని నేను నమ్మాలనుకుంటున్నాను. దయచేసి నేను కరెక్ట్ అని నిరూపించండి'' అని రాసుకొచ్చింది.

''అంటే పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళు ఎవ్వరు పడితే వాళ్ళు ఏది పడితే అది నన్ను అనొచ్చు. నేను ఒకమాటే తిరిగి జవాబు ఇస్తే మాత్రం 'పాపం ముసలాయన.. పాపం పెద్దాయన.. పాపం చిన్నవాడు.. పాపం ఏదో తెలీక.. సీన్ చెయ్యకండి' లాంటి రియాక్షన్స్ నాపై వస్తాయా? ఎంత అన్యాయం అండి ఇది?. అంటే ఒక ట్రాష్ లాగా పడాలి కానీ.. ఆ ట్రాష్ మీపై పడకూడదు. అంతేనా?. పెద్దరికం చిన్నరికం అనేవి వయసుతో కాదండి.. అనుభవంతో..  కండక్టు చేసుకునే విధంలో ఉంటుంది. ఆయనంటే ఒక యాక్టర్ గా నాకు చాలా రెస్పెక్ట్. విభిన్నమైన పాత్రలు చాలా అద్భుతంగా అభినయించారు. కానీ వ్యక్తిగా ఆయన మాటలు అనవసరమైనవి.. స్థాయికి తగినవి కాదు'' అని అనసూయ ట్విట్టర్ వేదికగా కోట శ్రీనివాసరావు కామెంట్స్ పై స్పందించింది.