Begin typing your search above and press return to search.

అమెరికాలో కాదు.. అమీర్‌ పేటలో ఉన్నట్లు ఉంది: రాజమౌళి

By:  Tupaki Desk   |   1 Oct 2022 9:43 AM GMT
అమెరికాలో కాదు.. అమీర్‌ పేటలో ఉన్నట్లు ఉంది: రాజమౌళి
X
'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో ఎస్ఎస్ రాజమౌళి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకుంది. గ్లోబల్ ఆడియన్స్ ప్రశంసలు దక్కించుకున్న ఈ ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాని.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ థియేట‌ర్‌ లో స్క్రీనింగ్ చేశారు.

లాస్ ఏంజెల్స్‌ లోని చైనీస్ థియేటల్స్ లో ఉన్న అతిపెద్ద IMAX స్క్రీన్‌లో RRR చిత్రాన్ని స్పెషల్ గా ప్రదర్శించారు. బియాండ్ ఫెస్ట్‌ లో భాగంగా ఒరిజిన‌ల్ వెర్ష‌న్ ను ఇంగ్లీష్ స‌బ్ టైటిల్స్‌ తో స్క్రీనింగ్ చేసారు. దీనికి దర్శకధీరుడు రాజమౌళి కూడా హాజరయ్యారు.

RRR స్పెషల్ స్క్రీనింగ్ కు అద్భుతమైన స్పందన లభించింది. సినిమా చూడటానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రేక్షకులను చూసి రాజమౌళి ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా దర్శకుడు వారితో ఇంటరాక్ట్ అయి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ట్రిపుల్ ఆర్ చిత్రానికి తనకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పిన ఆడియన్స్ ను ఉద్దేశించి రాజమౌళి మాట్లాడుతూ.. "ప్రపంచంలోనే అతిపెద్ద ఇమాక్స్ స్క్రీన్ సినిమా చూడటానికి నేను అమెరికా వస్తున్నానని ఊహించుకున్నా.. కానీ ఇది నా స్వస్థలమైన హైదరాబాద్‌ లోని అమీర్‌ పేట్‌ లా ఉంది" అని అన్నారు.

RRR సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన తర్వాత అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆస్కార్ అవార్డ్స్ కూడా వస్తాయని పలువురు హాలీవుడ్ ప్రముఖులు జోస్యం చెప్పారు.

అయితే ఆస్కార్ అవార్డ్స్ కోసం మనదేశం తరపున అఫీషియల్ ఎంట్రీగా 'ఆర్ఆర్ఆర్‌' చిత్రాన్ని ఎంపిక చేయలేదు. అయినప్పటికీ వేరే మార్గంలో నామినేట్ అయ్యే అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద థియేటర్ లో స్క్రీనింగ్ అవ్వడం.. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ రావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఏదేమైనా 'బాహుబలి' ప్రాంఛైజీతో తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించిన ఎస్ఎస్ రాజమౌళి.. ఇప్పుడు RRR సినిమాతో గ్లోబల్ అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇది నిజంగా తెలుగు సినిమా మరియు భారతీయ సినిమా గర్వపడే విషయమని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.