మాజీ ప్రియుడి పనిపై హైకోర్టుతో షాకిచ్చిన అమలాపాల్

Sat Nov 21 2020 10:00:43 GMT+0530 (IST)

Amala Paul Gave Shock  To Her Ex Boy Friend

విషయం ఏదైనా సరే.. మొహమాటం లేకుండా చెప్పేసే అతి కొద్దిమంది నటీమణుల్లో ఒకరు అమలాపాల్. మిగిలిన వారి మాదిరి ఆమె మాటల్లో మెలోడ్రామా చాలా తక్కువగా కనిపిస్తుంటుంది. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేయటమే కాదు.. చాలా సింఫుల్ గా బతికే ఆమె మిగిలిన హీరోయిన్లకు కాస్త భిన్నమని చెప్పాలి. తరచూ ఏదో ఒక వివాదంలోనో.. సంచలనాలతోనో ఆమె మీద వార్తలు వస్తుంటాయి. అలాంటి ఆమె తన మాజీ ప్రియుడుకు వ్యతిరేకంగా  మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.. తన వాదనకు తగ్గట్లే ఆదేశాల్ని తెచ్చుకున్న వైనం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.తెలుగు.. తమిళంతోపాటు పలు భాషల్లో నటించిన అమలాపాల్ 2014లో తమిళ దర్శకుడు ఎ.ఎల్ విజయ్ ను ప్రేమించి పెళ్లాడారు. అనంతరం వారిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. తర్వాత కొంతకాలం ఆమె ఒంటరిగానే ఉంటున్నారు. ఇలాంటివేళ బాలీవుడ్ గాయకుడు భవిందర్ సింగ్ తో ప్రేమలో పడినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే.. ఏ రోజు ఆమె వాటిని ఖండించలేదు.

ఇదిలా ఉంటే.. ఇటీవల అమలాపాల్ తో తాను సన్నిహితంగా ఉన్న ఫోటోల్ని షేర్ చేశారు భవిందర్ సింగ్. ఈ మధ్యనే తన జీవితంలో మరొకరు ఉన్నారన్న ఆమె.. ఎవరన్న విషయాన్ని వెల్లడించలేదు. కానీ.. సోషల్ మీడియాలో షేర్ అయిన ఫోటోలు చూసినంతనే.. గాయకుడితో పెళ్లి చేసుకున్నారన్న భావన కలిగేలా ఉన్నాయి. దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిగత ఫోటోల్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

దీనిపై విచారించిన న్యాయస్థానం తాజాగా అమలాపాల్ వ్యక్తిగత ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు.. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోల మీద వివరణ ఇవ్వాలని కోరుతూ కేసు విచారణను డిసెంబరు 22కు వాయిదా వేసింది. భవిందర్ సింగ్ షేర్ చేసిన ఫోటోలు.. ఒక కమర్షియల్ కోసం తీసిన ఫోటోలని.. వాటిని దుర్వినియోగం చేస్తూ.. అందరిని తప్పుదారి పట్టించేలా ఫోటోల్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయటంపై ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

మొత్తానికి తనకు ఇష్టం లేని పని చేసిన గాయకుడికి అమలాపాల్ అదిరేలా షాకిచ్చిందని చెప్పకతప్పదు. ఇక.. ఫోటోల విషయానికి వస్తే.. భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత కొంతకాలం వీరిద్దరూ సన్నిహితంగా ఉన్నారని.. అప్పట్లో తీసుకున్న ఫోటోలుగా చెబుతున్నారు. అయితే.. వీరిద్దరి మధ్య కొంతకాలం క్రితమే బ్రేకప్ అయ్యిందన్న మాట కోలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.