స్టార్ ఫ్యామిలీ స్టూడియోకు అంతా రెడీ!

Fri Sep 23 2022 07:00:01 GMT+0530 (IST)

Allu studio ready

చెన్నై నుంచి హైదరాబాద్ కు సినీ ఇండస్ట్రీ తరలి వచ్చిన తరువాత ఇక్కడే పలు స్టూడియోలు వెలిశాయి. ఇందులో అక్కినేని నాగేశ్వరరావుకు సంబంధించిన అన్నపూర్ణ స్టూడియో.. దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన `రామానాయుడు స్టూడియో` రామానాయుడు సినీ విలేజ్ (నానక్ రామ్ గూడా) సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి చెందిన పద్మాలయా స్టూడియో ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన రామకృష్ణా హార్టికల్చరల్ స్టూడియో (నాచారం) లు వెలిశాయి. అయితే ఇందులో ప్రధానంగా రెండు స్టూడియోలు మాత్రమే రన్నవుతూ సినిమా షూటింగ్ లతో కలకలలాడుతున్నాయి.అన్నపూర్ణ స్టూడియోస్ ఈ విషయంలో ముందు వరుసలో  నిలుస్తోంది. ఆ తరువాత రామానాయుడు స్టూడియో ఓపెనింగ్ లకు కొన్ని ఇన్ డోర్ షూటింగ్ లకు ప్రధానంగా పనిచేస్తోంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి తెలుగు సినిమాకు ఎంతో కంట్రీబ్యూట్ చేసిన మెగా ఫ్యామిలీ నుంచి కానీ అల్లు ష్యామిలీ నుంచి కానీ ఫిల్మ్ స్టూడియో లేదు. అప్పట్లో మెగాస్టార్ ఫిల్మ్ స్టూడియోని ప్లాన్ చేస్తున్నారంటూ వార్తలు వినిపించినా దానికి సంబంధించిన ఎలాంటి ప్రకటన రాలేదు.

అయితే మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు వారి ఫ్యామిలీ నుంచి మాత్రం ఫిల్మ్ స్టూడియో రాబోతోంది. అల్లు స్టూడియోస్ పేరుతో ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని అల్లు అరవింద్ కు చెందిన సువిశాలమైన స్థలంలో `అల్లు స్టూడియోస్` కు శ్రీకారం చుట్టారు. అధునిక వసతులతో సినిమాలకు వెబ్ సిరీస్ లకు రియాలిటీ షోలకు అనువుగా వుండే విధంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి కూడా అధునాతన సాంకేతికతని ఈ స్టూడియో ద్వారా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.  

రెండేళ్ల క్రితమే స్టూడియో నిర్మాణం గురించి ప్రకటించి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అల్లు వారి ఫ్యామిలీ అనుకున్న వెంటనే స్టూడియో నిర్మాణాన్ని మొదలు పెట్టేసింది. ఇప్పటికి సర్వాంగ సుందరంగా అల్లు వారి స్టూడియో `అల్లు స్టూడియోస్` నిర్మాణం పూర్తయింది. అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా అక్టోబర్ 1న స్టూడియోని ప్రారంభించబోతున్నారు.

ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి అల్లు అరవింద్ అల్లు అర్జున్ తో పాటు ఇరు కుటుంబాలకు సంబంధించిన కుటుంబ సభ్యులంతా హాజరు కానున్నారట. ఈ స్టూడియోలో అల్లు అర్జున్ అల్లు వెంకట్ అల్లు శిరీష్ భాగస్వాములు. ఈ స్టూడియోలో మొదట ప్రారంభం కానున్న మూవీ `పుష్ప 2` అని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.