అఖిల్ బ్లాక్ బస్టర్ మూవీ సక్సెస్ మీట్ కు అతిథిగా అల్లు అర్జున్..!

Mon Oct 18 2021 15:00:02 GMT+0530 (IST)

Allu Arjun as guest on Akhil blockbuster movie Success Meet

యూత్ కింగ్ అఖిల్ అక్కినేని - పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్''. దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలైన ఈ సినిమా తొలి ఆట నుంచే పాటిజిట్ టాక్ తెచ్చుకొని అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది. ప్రేక్షకుల మనసు దోచిన ఈ బ్యాచిలర్.. పండగ సీజన్ ను క్యాష్ చేసుకుని వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడు. ఇప్పటికే యూఎస్ఏ లో బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకొని లాభాల్లోకి ఎంటర్ అయ్యాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మూడు రోజుల్లోనే 24 కోట్లు (గ్రాస్) వసూలు చేసి దసరా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలో కరోనా సెకండ్ వేవ్ తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల జాబితాలో రెండో స్థానంలో ఉంది.''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'' సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మరింత వేగంగా జరుగుతున్నాయి. సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పడానికి ఇప్పటికే వైజాగ్ లో గ్రాండ్ గా థాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ క్రమంలో ఇప్పుడు హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు (అక్టోబర్ 19) సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ కు ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో వచ్చే సినిమాలకు అల్లు అర్జున్ ఎప్పుడూ అండగా నిలబడుతుంటారు. గతంలో చాలా సినిమాలకు ఇదే చేశారు. ఇప్పుడు ప్రేక్షకాదరణ పొందుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా సెలబ్రేషన్స్ లో పాల్గొంటూ తనవంతు సపోర్ట్ అందించనున్నారు బన్నీ. ఇప్పటికే అద్భుతమైన కలెక్షన్స్ తీసుకొచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా.. ఈ ప్రమోషన్స్ తో వీక్ డేస్ లో కూడా మంచి వసూళ్లు సాధిస్తోందని దర్శక నిర్మాతలు నమ్ముతున్నారు.

కాగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు - వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం సమకూర్చారు. ప్రదీశ్ ఎమ్ వర్మ సినిమాటోగ్రఫీ అందించగా.. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఈ చిత్రంలో ఆమని - ఈషా రెబ్బా - నేహా శెట్టి - ఫారియా అబ్దుల్లా - మురళీ శర్మ - చిన్మయి - వెన్నెల కిషోర్ - జయప్రకాష్ - అజయ్ - ప్రగతి - అమిత్ తివారి - పోసాని కృష్ణ మురళి - శ్రీకాంత్ అయ్యంగార్ - అభయ్ - సుడిగాలి సుధీర్ - గెటప్ శీను తదితరులు ఇతర పాత్రలు పోషించారు.