బన్నితో ఎవరు ముందు? మురుగ వర్సెస్ వేణు!

Tue May 04 2021 11:30:44 GMT+0530 (IST)

Allu Arjun Upcoming Movie Updates

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప చిత్రంలో నటిస్తున్నారు. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మెజారిటీ షూటింగ్ పూర్తయింది. ఇటీవల కోవిడ్ సోకడంతో బన్ని చికిత్సతో కోలుకుంటున్నారు.



ఈలోగానే బన్ని కోసం బాస్ అల్లు అరవింద్ పలువురు దర్శకులు వినిపించే కథల్ని వింటున్నారని ..తదుపరి ప్రాజెక్టుల్ని ఖరారు చేసే ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇప్పటికే బన్నీతో కొరటాల ప్రాజెక్ట్ కన్ఫామ్ అయ్యింది. కానీ అది ఆలస్యమవుతుంది.

ఈలోగానే వేరొక దర్శకుడితో బన్ని పని చేయాల్సి ఉంటుంది. అయితే ఈసారి జాక్ పాట్ కొట్టేదెవరు? అంటే.. దానికి ఇంకా సరైన ఆన్సర్ లేదు. వేణు శ్రీరామ్ - దిల్ రాజు కాంబినేషన్ చాలా కాలంగా ఐకన్ స్క్రిప్టుతో బన్ని కోసం వేచి చూస్తోంది. అధికారికంగా ప్రకటించినదే కానీ సుదీర్ఘ నిరీక్షణ తప్పలేదు. ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించే దిశగానూ ఇప్పుడు చర్చలు సాగుతున్నాయి. ఇటీవలే దిల్ రాజు స్వయంగా ఐకన్ ఆగిపోలేదని అభిమానులకు వెల్లడించిన సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ లాంటి బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన వేణు శ్రీరామ్ ఐకన్ ని పట్టాలెక్కించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

మరోవైపు జాతీయ అవార్డ్ గ్రహీత.. తమిళ దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ ఎట్టి పరిస్థితిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని లాక్ చేయాలని పంతంతో ఉన్నారట. ఆయన ఇటీవలే అల్లు అరవింద్ ని కలిసారు. లైన్ వినిపించారు. కానీ పూర్తి స్క్రిప్టును వినిపించాల్సి ఉందిట. బహుశా ఇది గజినీ సీక్వెల్ అయ్యి ఉంటుందన్న ఊహాగానాలు ఇటీవల వేడెక్కిస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం బన్నీపై మురుగదాస్ ఫోటోషూట్ చేయించారని కూడా కథనాలొచ్చాయి. మొత్తానికి బన్నీతో తదుపరి చిత్రానికి వేణు శ్రీరామ్ .. మురుగదాస్ పోటీపడుతున్నారన్న దానిపై స్పష్ఠత ఉంది. ఆ ఇద్దరితో పాటు కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ కూడా రేసులో ఉన్నారు. బన్ని ఎవరికి ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు అన్నది వేచి చూడాలి.