Begin typing your search above and press return to search.

బన్నీ ఆ స్టైలిష్ డైరెక్టర్ కి మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాడా...?

By:  Tupaki Desk   |   24 May 2020 3:32 PM GMT
బన్నీ ఆ స్టైలిష్ డైరెక్టర్ కి మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాడా...?
X
టాలీవుడ్ కి 'అతనొక్కడే’ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు సురేందర్ రెడ్డి అలియాస్ సూరి. ఫస్ట్ సినిమాతోనే సినీ ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నాడు. ఆ తరవాత ఎన్టీఆర్ తో తీసిన 'అశోక్'.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన 'అతిథి' సినిమాలు పరాజయాలు చవి చూశాయి. ఆ తర్వాత ‘కిక్‌’ ‘ధృవ’ 'రేసుగుర్రం' లాంటి డిఫరెంట్‌ కాన్సెప్ట్‌‌ లతో సినిమాలు తీసి సూపర్‌ హిట్స్ అందుకున్నాడు స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి. గతేడాది మెగాస్టార్ చిరంజీవితో 'సైరా నరసింహారెడ్డి' తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఓవర్ బడ్జెట్ సినిమా అవడం వలన కలెక్షన్స్ రాబట్టలేకపోయిందనే టాక్ ఉంది. అయితే ప్రస్తుతం సురేందర్ రెడ్డి ఇప్పుడు గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు.

'సైరా' సినిమా విడుదలై దాదాపు ఎనిమిది నెలలు అవుతున్నా ఆయన ఇంకా కొత్త మూవీ ప్రకటించలేదు. ఆ సినిమా తర్వాత వెంటనే ప్రభాస్ తో సినిమా చేయవచ్చు అనుకున్న సురేందర్ రెడ్డి ఆశలు నెరవేరలేదు. అంతేకాకుండా 'సైరా' తరువాత ఆయన ఒకటి రెండు ప్రాజెక్టులు అనుకున్నప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. అప్పట్లో నాగ చైతన్య, అఖిల్, నితిన్ లతో సురేందర్ రెడ్డి స్టోరీ డిస్కషన్స్ జరుపుతున్నాడని న్యూస్ వచ్చింది. కానీ అవి స్టోరీలుగానే మిగిలిపోయాయి. అయితే లేటెస్ట్ గా అల్లు అర్జున్ తో సూరి నెక్స్ట్ సినిమా ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి. ఇంతకుముందు బన్నీ - సూరి కాంబినేషన్లో వచ్చిన 'రేసుగుర్రం' సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్ లో బెస్ట్ కలెక్షన్స్ అందుకున్న మూవీగా నిలిచింది. కాబట్టి సురేందర్ రెడ్డి - బన్నీ కలయికలో మూవీ ఉండవచ్చని అంటున్నారు.

కానీ బన్నీ ప్రస్తుతం సుకుమార్ తో కలిసి 'పుష్ప' మరియు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఐకాన్' సినిమాలు చేస్తున్నాడు. అంటే ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత ఈ చిత్రం ఉండే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే కనుక నిజమైతే బన్నీకి మరో హిట్ పడినట్లే అని సూరి సెంటిమెంట్ నమ్మేవారు అనుకుంటున్నారు. సురేందర్ రెడ్డి 'అతిథి' సినిమా నుండి ఒక సినిమా ప్లాప్ అయితే నెక్స్ట్ సినిమా హిట్ అవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో 'సైరా' ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కాబట్టి నెక్స్ట్ సినిమా బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని సూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు.