Begin typing your search above and press return to search.

ప్యాన్ ఇండియా బరిలోకి దిగిన రేసుగుర్రం!

By:  Tupaki Desk   |   9 April 2020 4:00 AM GMT
ప్యాన్ ఇండియా బరిలోకి దిగిన రేసుగుర్రం!
X
టాలీవుడ్ గురించి మాట్లాడుకోవాలంటే తప్పనిసరిగా 'బాహుబలి' కి ముందు.. తర్వాత అని చెప్పుకోవాల్సిందే. ఒక తెలుగు సినిమాకు ఇంత సత్తా ఉందని.. ఇంత మార్కెట్ ఉందని.. దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా మన సినిమాలు ప్రేక్షకులను మెప్పించగలవని రాజమౌళి ప్రూవ్ చేశాడు. దీంతో యూనివర్సల్ అప్పీల్ ఉండే ప్యాన్ ఇండియా సినిమాల జోరు పెరిగింది. ఇక బాహుబలి సినిమాతో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ గా మారడంతో ఇతర హీరోలు కూడా తమ ప్యాన్ ఇండియా కలలను సాకారం చేసుకునేందుకు శ్రీకారం చుట్టారు.

టాలీవుడ్ విషయమే తీసుకుంటే మన స్టార్లలో కొంతమందికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. సౌత్ లో డబ్బింగ్ సినిమాల రిలీజుల ద్వారా పాపులారిటీ దక్కితే.. నార్త్ లో హిందీ డబ్బింగ్ సినిమాలు.. యూట్యూబ్ ద్వారా మన హీరోలు తెగ పాపులారిటీ సాధించారు. ప్రభాస్ తర్వాత ఎన్టీఆర్.. చరణ్ లు ప్యాన్ ఇండియా హీరోలుగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'RRR' తో ఈ ఇద్దరూ మాస్ హీరోలు హిందీ ప్రేక్షకులను ఫిదా చెయ్యడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా నేను కూడా సైసై అంటూ రేసుగుర్రంలా 'పుష్ప' తో ప్యాన్ ఇండియా బరిలోకి దిగుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పుష్ప' నాలుగు దక్షిణాది భాషలతో పాటుగా హిందీలో కూడా రిలీజ్ కానుందని 'పుష్ప' పోస్టర్లతోనే క్లారిటీ వచ్చేసింది. అల్లు అర్జున్ కు సౌత్ లో మంచి ఫాలోయింగే ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా కేరళలో కూడా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక కర్ణాటకలో కూడా మంచి ఫాలోయింగే. ఒక్క తమిళనాట మాత్రమే అల్లు అర్జున్ కు పెద్దగా ఫాలోయింగ్ లేదు. అయితే ఈ సినిమాను తమిళంలో కూడా విడుదల అవుతుంది కాబట్టి ఆ మార్కెట్ కూడా కవర్ అయినట్టే.

హిందీ మార్కెట్ విషయానికి వస్తే అల్లు అర్జున్ హిందీ డబ్బింగ్ సినిమాలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తుంటాయి. ఒక్కోసారి అవి బిలియన్ల మార్క్ కూడా టచ్ అవుతాయి. అల్లు అర్జున్ డ్యాన్స్ అంటే పడిచచ్చిపోయే హిందీ ప్రేక్షకులు లెక్కలేనంత మంది ఉన్నారు. సుకుమార్ సినిమాలకు యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది కాబట్టి ఈ సినిమాతో హిందీ ప్రేక్షకులను మెప్పించే అవకాశాలు ఉన్నాయి. హిందీలో ఇలాంటి రగ్డ్ సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. కంటెంట్ సరిగ్గా ఉంటే మాత్రం అక్కడ అల్లు అర్జున్ సినిమా రఫ్ఫాడించడం ఖాయమే. అటు ప్రభాస్.. ఎన్టీఆర్.. చరణ్ లతో పాటు హిందీ ప్రేక్షకులకు స్టైలిష్ స్టార్ కూడా తన టాలెంట్ చూపిస్తాడని మనం ఫిక్స్ అయిపోవచ్చు.