Begin typing your search above and press return to search.

అందుకే సొంత ఆఫీస్ అంటున్న బన్నీ

By:  Tupaki Desk   |   16 Jan 2020 11:54 AM GMT
అందుకే సొంత ఆఫీస్ అంటున్న బన్నీ
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లాస్ట్ సినిమా 'నాపేరు సూర్య' నిరాశపరచడంతో అల్లు అర్జున్ సినిమాల నుండి కొన్ని నెలలు గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. గ్యాప్ తీసుకోలేదు.. వచ్చింది అంటున్నారు కాబట్టి.. మనం కూడా అలానే అనుకుందాం. అయితే గ్యాప్ వచ్చినప్పటికీ తన కొత్త సినిమా 'అల వైకుంఠపురములో' ఫలితంపై అల్లు అర్జున్ సంతోషంగా ఉన్నారు. 'అల వైకుంఠపురములో' ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.

అల్లు అర్జున్ తన మొదటి సినిమా నుండి ఇప్పటివరకూ గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుంచే పని చేస్తున్నారు. అల్లు అర్జున్ ఈమధ్యే కొత్త ఆఫీస్ తీసుకున్నారు. తనకంటూ ప్రత్యేకంగా ఒక ఆఫీస్ తీసుకోవడంతో ఇకపై అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ లో తన సినిమాలు చెయ్యరని.. సొంత బ్యానర్లోనే చేస్తారని కూడా గుసగుసలు వినిపించాయి. కొందరైతే నాన్నగారు అరవింద్ తో కూడా అభిప్రాయ భేదాలు వచ్చాయని కూడా అన్నారు. ఈ విషయంపై అల్లు అర్జున్ ను ప్రశ్నిస్తే అదేమీ లేదని నవ్వేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఎక్కువ సినిమాల నిర్మాణం జరుగుతోందని.. పలు సినిమాల టీమ్స్ ఒకే ఆఫీస్ లో ఇరవై నాలుగు గంటలూ పని చేస్తూ ఉండడంతో స్పేస్ సరిపోవడం లేదని.. తనకు ప్రైవసీ ఉండడం లేదని అందుకే సొంత ఆఫీస్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.

అల్లు అర్జున్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే తన నెక్స్ట్ సినిమాను సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని.. ఈ సినిమాలో అల్లు అర్జున్ తొలిసారి ఊర మాస్ గెటప్ లో.. రగ్డ్ లుక్ లో కనిపిస్తారని అంటున్నారు. 'రంగస్థలం' తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది.