బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో డైలమాలో ఉన్నాడా...?

Thu Jul 16 2020 17:20:40 GMT+0530 (IST)

Is Bunny in a dilemma about the next project ...?

అల్లు అర్జున్ ప్రస్తుతం స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ తో 'పుష్ప' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో 'అల వైకుంఠపురంలో' సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన బన్నీ 'పుష్ప'తో కంటిన్యూ చేస్తాడని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే 'పుష్ప' నుండి రిలీజైన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ ఎక్కువ భాగం అడవుల్లో జరుపుకోవాల్సి ఉంది. దీని కోసం భారీ షెడ్యూల్ ప్లాన్ చేయగా కరోనా మహమ్మారి అడ్డుతగిలింది. అయితే ప్రస్తుతం ఇంటికే పరిమితమైన బన్నీ కొత్త కథలను వింటున్నాడట.కాగా బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నిజానికి బన్నీ గతేడాది 'ఓ మై ఫ్రెండ్' దర్శకుడు వేణు శ్రీరాంతో 'ఐకాన్' అనే మూవీ అనౌన్స్ చేసారు. దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కాల్సిన 'ఐకాన్' ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ అటకెక్కిందని అందరూ భావించారు. అయితే బన్నీ బర్త్ డే నాడు ఈ మూవీ లైన్లో ఉందని మేకర్స్ పోస్టర్ తో వెల్లడించారు. దీంతో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా 'ఐకాన్' అని అందరూ అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు బన్నీ స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో తదుపరి సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. 'ఆచార్య' సినిమా తర్వాత కొరటాల శివ డైరెక్ట్ చేసేది బన్నీ సినిమానే అని అనుకుంటున్నారు.

ఇప్పటికే కొరటాల చెప్పిన స్టోరీ లైన్ బన్నీకి బాగా నచ్చిందని.. బన్నీని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ వర్క్ డెవలప్ చేసే పనిలో శివ ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించనున్న ఈ సినిమాలో కొరటాల తన స్టైల్ లోనే స్ట్రాంగ్ మెసేజ్ ఉండేలా స్టోరీ రెడీ చేస్తున్నాడని కూడా అనుకున్నారు. ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్ట్స్ లో ఏది ముందుగా ప్రారంభించాలనే విషయంలో బన్నీ డైలమాలో ఉన్నాడట. 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలని అల్లు అర్జున్ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నెక్స్ట్ మూవీ కూడా అదే రేంజ్ లో ఉండాలని కోరుకుంటున్నాడట. మరి బన్నీ 'పుష్ప' తర్వాత 'ఐకాన్' స్టార్ట్ చేస్తాడా లేదా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తాడా అనే దానిపై క్లారిటీ రావాలంటే కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే.