'ట్యాక్సీవాలా' కోసం మెగాహీరో

Thu Nov 08 2018 13:38:15 GMT+0530 (IST)

Allu Arjun Attend for Vijay Devarkonda Taxiwaala Movie PRe Release Event

యూత్ లో మంచి క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. పలు సార్లు వాయిదాలు పడ్డ ట్యాక్సీవాలా ఎట్టకేలకు ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను ఈనెల 11న చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా మెగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరు కాబోతున్నట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.ఈ చిత్రంను గీతా ఆర్ట్స్ 2 మరియు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా మీడియం బడ్జెట్ తో నిర్మించాయి. ఈ చిత్రానికి అల్లు అర్జున్ వ్యక్తిగత పీఆర్ ఓ అయిన ఎస్ కే ఎన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. గతంలో కూడా ఎస్ కే ఎన్ చిత్రాలను నిర్మించాడు. చిన్న బడ్జెట్ తో రూపొందిన ఆ చిత్రాలు మంచి విజయాలను దక్కించుకున్నాయి. అందుకే ఈ చిత్రంపై కూడా నమ్మకం వ్యక్తం అవుతుంది. బన్నీ ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో హాజరు కాబోతున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు మరింతగా పెరగడం ఖాయం.

సైంటిఫిక్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతో పాటు ప్రియాంక జువాల్కర్ - మాళవిక నాయర్ - కళ్యాణి - మధునందన్ లు ముఖ్య పాత్రల్లో నటించారు. ‘గీత గోవిందం’ చిత్రంతో విజయ్ దేవరకొండకు వచ్చిన క్రేజ్ తో ‘ట్యాక్సీవాలా’ భారీ ఓపెనింగ్స్ ను దక్కించుకోవడం ఖాయంగా ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.