అల్లు అరవింద్ చేతికి శింబు మూవీ

Wed Dec 08 2021 14:05:42 GMT+0530 (IST)

Allu Aravind owns Manadu remake rights

కొత్తదనం ఎక్కడున్న దాన్ని ఇట్టే పట్టేయడంలో అందరి కంటే ముందుంటారు మెగా ప్రొడ్యూసర్.. మాస్టర్ మైండ్ అల్లు అరవింద్. కొత్త తరహా చిత్రాలని కాన్సెప్ట్‌లని ప్రోత్సహించడంలో ఆయన శైలి ప్రత్యేకం అన్నది ఇండస్ట్రీ వర్గాలకు తెలిసిందే. అదే పంథాని అనుసరిస్తూ `ఆహా` ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం కొత్త తరహా గేమ్ షోలని.. సెలబ్రిటీ టాక్ షోలని ప్లాన్ చేస్తూ వాటిని విజయవంతంగా ప్రేక్షకులకు చేరువ చేయడంలో సఫలీకృతులవుతున్నారు.ఇక కొత్త తరహా సినిమాల విషయంలోనే ఆయన ఇదే పంథాను అనుసకిస్తూ ప్రేక్షకులకు సరికొత్త చిత్రాలని అందిస్తున్నారు. తాజాగా అమలాపాల్ నటించిన `కుడి ఎడమైతే` థ్రిల్లర్ ని స్క్రిప్ట్ దశలోనే దక్కించుకున్న ఆయన తాజాగా మరో తమిళ చిత్ర రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నారు.

తమిళ స్టార్ శింబు హీరోగా విభిన్న చిత్రాల దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన `మనాడు` రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నారు. తమిళంలో విడుదలైన ఈ మూవీ అక్కడ భారీ వసూళ్లని సాధిస్తూ సూపర్ హిట్ దిశగా పయనిస్తోంది.

2014లో వచ్చిన హాలీవుడ్ మూవీ `ఎడ్జ్ ఆఫ్ టుమారో` మూవీ ఐడియాని కాపీ చేసి వెంకట్ ప్రభు ఈ మూవీని రూపొందించారు. లూప్ కాన్సెప్ట్ ఆధారంగా ఈ మూవీని సరికొత్త పంథాలో తెరకెక్కించారు.

డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో సరికొత్త అనుభూతిని పంచుతున్న ఈ మూవీని తెలుగులో డబ్ చేయాలని... లేదా రీమేక్ చేయాలని తెలుగు ప్రొడ్యూసర్స్ చాలా మంది ప్లాన్ చేయడం మొదలుపెట్టారు. తాజా సమాచారం ప్రకారం భారీ పోటీ మధ్య ఈ చిత్ర రీమేక్ హక్కుల్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ దక్కించుకున్నారని తెలిసింది.

తెలుగులో ఈ రీమేక్ ని సాయి ధరమ్‌తేజ్ తో కానీ అల్లు శిరీష్‌తో కానీ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ తరహా లూప్ కాన్సెప్ట్ నేపథ్య కథల్ని మన తెలుగు ప్రేక్షకులు ఎంత వరకు ఎంకరేజ్ చేస్తారన్నదే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. అయితే కొత్తదనాన్ని ఎప్పుడూ ప్రోత్సహించే తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పకుండా ఆదరిస్తారని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు.