అవార్డు సరే.. 'రామాయణం 3డి' మొదలెడతారా?

Tue Jan 21 2020 18:33:25 GMT+0530 (IST)

Allu Aravind Gets Award from Ex President

సినిమా పురోభివృద్ధి .. సామాజిక బాధ్యత  .. ఈ రెండిటినీ ఏక కాలంలో నడిపించిన వారికి ప్రభుత్వం తరపున గుర్తింపు గౌరవం దక్కితే అంతకంటే కావాల్సినది ఏం ఉంటుంది? ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే ఉన్నారు అల్లు అరవింద్. ఆయన ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్ అవార్డ్ 2019 ను అందుకున్నారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా ఈ పురస్కారాన్ని అరవింద్ కు ప్రదానం చేశారు.సినిమా పురోభివృద్ధి కోసం పాటు పడడమే గాక చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సహా సామాజిక సేవా కార్యక్రమాలు చేసినందుకుగాను ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అవార్డు దక్కిన సందర్భంగా అరవింద్ కేంద్ర ప్రభుత్వానికి- జ్యూరీకి ధన్యవాదాలు తెలిపారు. అవార్డులు కొత్త ఉత్తేజాన్ని ఇస్తాయని.. ఇకపైనా సమాజం కోసం తన సేవలు కొనసాగిస్తానని అన్నారు.

తన తండ్రి గారికి అవార్డ్ దక్కినందుకు అల్లు అర్జున్ ఆనందం వ్యక్తం చేశారు. శుభాకాంక్షలు నాన్నా.. కుటుంబం గర్వించదగ్గ సందర్భమిది అంటూ విష్ చేశారు. తెలుగు-తమిళం- హిందీ సహా పలు భాషల్లో అల్లు అరవింద్ సినిమాలు నిర్మించారు. స్టారాధి స్టార్లకు బ్లాక్ బస్టర్లను అందించారు. మెగాస్టార్ చిరంజీవి అనే మెగా వృక్షం వెనక ఆయన కఠోర ధీక్షను మెగాభిమానులు మరువలేరు. మెగాస్టార్ సామాజిక సేవలన్నిటిలోనూ ఆయన భాగస్వామిగానూ కొనసాగుతున్నారు. అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ తో ఉత్సాహంగా ఉన్న అరవింద్.. ప్రస్తుతం రామాయణం 3డి సిరీస్ ని నిర్మించేందుకు దాదాపు 1000 కోట్ల బడ్జెట్ వెచ్చించనున్నారని ప్రచారమవుతోంది.