వెంకటేశ్ తో కలిసి 'అల్లరి' చేయాలని ఉందట!

Tue Feb 23 2021 09:22:07 GMT+0530 (IST)

Allari Naresh Want To Act With Venkatesh

నవ్వించడమంటే ఎదుటివాడిని ఏడిపించడమంత తేలిక కాదు. నవరసాల్లో హాస్యాన్ని పండించడమే చాలా కష్టమైన విషయమని సీనియర్ ఆర్టిస్టులు ఎప్పుడో సెలవిచ్చారు. అలాంటి హాస్యరసాన్ని అవలీలగా పోషించే కథానాయకులలో 'అల్లరి' నరేశ్ ఒకరుగా కనిపిస్తాడు. రాజేంద్ర ప్రసాద్ తరువాత తెలుగు తెరపై హాస్యాన్ని తనదైన మార్కుతో నరేశ్ పరిగెత్తించాడు. ఆయన బాడీ లాంగ్వేజ్ .. కామెడీ టైమింగ్ .. డైలాగ్ డెలివరీ ఆడియన్స్ కి బాగా నచ్చేశాయి. దాంతో ఆయన సినిమాలకి మార్కెట్ పెరిగింది. మినిమమ్ గ్యారెంటీ హీరోగా నరేశ్ దూసుకుపోయాడు.'అల్లరి' నరేశ్ కామెడీ మాత్రమే చేయగలడనే విమర్శలను తిప్పికొట్టడానికి ఆయన 'గమ్యం' .. 'శంభో శివ శంభో' సినిమాలు చేశాడు. దాంతో కుర్రాడిలో కంటెంట్ కావలసినంత ఉందనే విషయం అటు ప్రేక్షకులకు .. ఇటు ఇండస్ట్రీకి కూడా అర్థమైంది. ఈ నేపథ్యంలో నరేశ్ 50 సినిమాలు పూర్తిచేసి తన జోరును కంటిన్యూ చేస్తున్నాడు. ఎనిమిదేళ్లుగా హిట్ పడకపోయినా దాని కోసం వెతికి .. వేటాడి 'నాంది' సినిమాకి తెచ్చేసుకున్నాడు. తొలి సినిమా హిట్ అయితే ఎలా సంతోషపడతారో .. ఇప్పుడు ఆయన అలా ఆనందపడుతున్నాడు. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయ్యాడు.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. 'నాంది' సినిమా నాకు విజయంతో పాటు ప్రశంసలు కూడా తెచ్చిపెడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. కామెడీ సినిమాలతో ఎక్కువగా పాపులర్ కావడం వలన 'నాంది'ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారా అనే చిన్నపాటి టెన్షన్ ఉండేది. కానీ కంటెంట్ ఉన్న సినిమాకి కంపల్సరీ హిట్ ఇచ్చేస్తాం అన్నట్టుగా వాళ్లు తీర్పు చెప్పారు. ఇకపై కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నాను. అలాగే మల్టీ స్టారర్లు కూడా చేయాలనుంది. వెంకటేశ్ గారి కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. అందువలన ఆయనతో కలిసి నటించాలని ఉంది. భవిష్యత్తులో దర్శకత్వం చేయాలనే ఆలోచన కూడా ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు.