గర్భంతో అలియాభాట్ హాలీవుడ్ సాహసం?

Tue Jun 28 2022 12:00:25 GMT+0530 (IST)

Aliabhat Hollywood Adventure With Pregnancy!

బాలీవుడ్ నటి అలియాభట్ గర్భం దాల్చిన శుభవార్తని నిన్నటి రోజున ప్రకటించిన సంగతి తెలిసిందే. కపూర్ ఇంట కుమారుడో? మనవడో? రాబోతున్నాడు అన్న వార్త తో ఒక్కసారిగా రెండు కుటుంబాల ఆనంధానికి అవదుల్లేవ్. వాళ్లతో పాటు అభిమానులు అంతే సంతోషించారు. కపూర్ ఇంట  జూనియర్ రాక్ స్టార్ రాబోతున్నాడంటూ అప్పుడే అభిమానులు సోషల్ మీడియా వేదికగా  అభిప్రాయాలు సైతం వెల్లడిస్తారు.ఇక తల్లిదండ్రులుగా ప్రమోట్ అవుతోన్న అలియాభట్- రణబీర్ కపూర్ ఆనందాన్ని అయితే మాటల్లో వర్ణించలేం. బుజ్జి పాపాయికి ఏడాదిలోగానే తల్లిదండ్రులుగా మారిపోతున్నాం అన్న ఉత్సాహం లో ఉన్నారు. అప్పుడే బేబి పట్ల జాగ్రత్తలు మొదలైపోయాయి. అమ్మతరుపు..అత్త గారు తరపు వారు తొమ్మిది నెలలు పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచిస్తున్నారు.

ఇలాంటి వ్యవహారాలు అన్ని సాధారణంగా కెరీర్ పై కొంత ప్రభావాన్ని చూపిస్తాయి. గర్భం దాల్చిన తర్వాత....నెలలు నిండుతున్న సమయంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. వాటిని తూచ తప్పకుండా పాటిస్తూనే పనులు చూసుకోవాల్సి ఉంటుంది. అయితే అలియాభట్ పరిస్థితి మాత్రం ఇక్కడ భిన్నంగా కనిపిస్తుంది.

ప్రధానంగా హాలీవుడ్ ప్రాజెక్ట్  అలియాకి గర్భానికి అడ్డు తగిలేలా కనిపిస్తోంది. ఇటీవలే అలియాభట్ హాలీవుడ్ సినిమా 'హార్ట్ ఆఫ్ స్టోన్' షూటింగ్ లో భాగమైన సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ అడ్వెంచర్ షూట్ లో భాగంగా అలియా పై మే నెలలో బ్రిటన్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. ఇంకా పూర్తి చేయాల్సిన కొన్ని బ్యాలెన్స్ సన్నివేశాలున్నాయి.

వాటికి ఇంకా సమయం ఉండటంతో తిరిగి ముంబై వచ్చేసింది. అటుపై  హిందీ సినిమా 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ' షూటింగ్ లో జాయిన్ అయింది. ముంబై షెడ్యూల్ పూర్తికాగానే లండన్ వెళ్లి మళ్లీ 'హార్ట్ ఆఫ్ స్టోన్' బ్యాలెన్స్ సన్నివేశాలు పూర్తి చేయాల్సి  ఉంది. ఇప్పటికే మెజార్టీ పార్ట్ షూట్ పూర్తయినప్పటికీ పెండింగ్ సీన్స్ కొన్నే ఉన్నా...నడుముకి రోప్ ని బలంగా బిగించుకుని చేయాల్సిన సీన్స్ కొన్ని ఉన్నాయట.

ఈనేపథ్యంలో అలియా వాటిలో పాల్గొంటుందా? లేదా? అన్న సందేహం వ్యక్తమవుతోన్న నేపథ్యంలో అలియా మాత్రం వెనక్కి తగ్గడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదని సన్నిహిత వర్గాల సమాచారం. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఆ సన్నివేశాలు పూర్తి చేస్తుందని సన్నిహితుల నుంచి  తెలుస్తుంది. అయితే వాటి చిత్రీకరణ నెమ్మదిగా సాగుతుందని..అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తికాపోవచ్చని  సమాచారం.

ఆలస్యం అవుతుందే తప్ప వాటిని అలియా తప్పక పూర్తిచేసే ఇండియాకి తిరిగొస్తుందని ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా అలియాభట్ మాత్రం గర్భంతో పెద్ద  సాహసం చేస్తుందన్నది వాస్తవం. సాధారణంగా ఏ నటి గర్భంతో యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనరు. అవసరమై సినిమా నుంచి తప్పుకుంటారు తప్ప!  రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు.  కానీ అలియా మాత్రం రిస్క్ తీసుకోకపోతే రస్క్ దొరకదని బలంగా సంకల్పించి ముందుకు వెళ్తుంది.