ఇంకా ఏకాలంలో ఉన్నావ్.. ఆలియా సీరియస్ కామెంట్స్

Wed Jun 29 2022 15:00:01 GMT+0530 (IST)

Alia Bhatt Serious Comments

ఇటీవలే పెళ్లి బంధంతో ఒక్కటైన రణబీర్ కపూర్.. ఆలియా భట్ తల్లిదండ్రులు కాబోతున్నారు. ఆలియా మరియు రణబీర్ కపూర్ లు స్వయంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆలియా తల్లికాబోతుంది అనే వార్తలు గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రధానంగా వస్తున్నాయి. ఆలియా అప్పుడే తల్లి కావడం ఏంటీ అంటూ కొందరు.. ఇప్పుడు ఆమె సినిమాల పరిస్థితి ఏంటీ అంటూ మరి కొందరు రకరకాలుగా కథనాలు అల్లేస్తున్నారు.ప్రముఖ వెబ్ మీడియా సంస్థ ఒకటి ఆలియా గర్బం దాల్చడం వల్ల ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలు ఆలస్యం అవ్వబోతున్నాయి అన్నట్లుగా పేర్కొంటూ కథనం ప్రచురించింది. ఆ కథనంపై ఆలియా భట్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. గర్భం దాల్చిన వెంటనే సినిమాలన్నీ పక్కన పెట్టేయాలా అన్నట్లుగా ప్రశ్నించింది. ఇంకా మీరు ఏ కాలంలో ఉన్నారంటూ ఆలియా ప్రశ్నించింది.

2022 లో కూడా మనం పితృస్వామ్య ప్రపంచంలో జీవిస్తున్నాం. ఇంకా చాలా మంది పాత కాలపు భావనల్లోనే ఉన్నారు. మీరు అనుకుంటున్నట్లుగా నా సినిమాలు ఏమీ కూడా ఆలస్యం అవ్వడం లేదు.. క్యాన్సిల్ అవ్వలేదు. నన్ను ఎవరు కూడా పైకి తీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు.. అయినా నేనేం పార్సిల్ ను కాదు.. వస్తువు ను కాదు అంటూ వ్యాఖ్యలు చేసింది.

నేను విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంటే వైద్యులు చెబుతారు.. నేను అందుకు తగ్గట్లుగా ఉంటాను. డాక్టర్ సలహా మేరకు నేను అన్ని పనులు చేసుకుంటున్నాను అన్నట్లుగా ఆలియా చెప్పుకొచ్చింది.

ఇప్పటికైనా మీ ఆలోచన విధానంను మార్చుకుని ఈ కాలంలో బతకండి. ఇప్పుడు మీరు నా గురించి వదిలేస్తే నేను వెళ్లి షూటింగ్ చేస్తాను అంటూ ఆ కథనంకు కౌంటర్ అన్నట్లుగా పోస్ట్ చేసింది.

ప్రస్తుతం బాలీవుడ్ లో ఆలియా ఒక సినిమాను చేస్తోంది. హాలీవుడ్ లో హార్ట్ ఆఫ్ స్టోన్ సినిమా లో నటిస్తుంది. ఇవే కాకుండా కొన్ని కమర్షియల్ షూటింగ్స్ లో కూడా పాల్గొంటుంది. హీరోయిన్ గా ఈమె నటించిన బ్రహ్మాస్త్ర సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. గర్భవతి అయినా కూడా ఆలియా బిజీ బిజీగానే ఉంది. ప్రస్తుతం ఆలియా షూటింగ్ లోనే ఉన్నట్లుగా ఆమె సోసల్ మీడియా పేజ్ ఫాలో అయితే తెలుస్తోంది.