Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: విడాకుల తర్వాత సుమంత్ - పవిత్రల జీవితం 'మళ్ళీ మొదలైంది'..!

By:  Tupaki Desk   |   30 July 2021 6:38 AM GMT
ఫస్ట్ లుక్: విడాకుల తర్వాత సుమంత్ - పవిత్రల జీవితం మళ్ళీ మొదలైంది..!
X
'ప్రేమకథ' చిత్రంతో హీరోగా పరిచయమైన అక్కినేని హీరో సుమంత్.. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో 'సత్యం' 'పౌరుడు' 'గౌరీ' 'మధుమాసం' 'గోల్కొండ హైస్కూల్' 'గోదావరి' 'మళ్ళీరావా' వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇటీవల 'క‌ప‌ట‌ధారి' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సుమంత్.. ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు.

అయితే గత రెండు రోజులుగా సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఓ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంది. హీరోయిన్ కీర్తి రెడ్డి తో విడాకులు తీసుకున్న సుమంత్.. పవిత్ర అనే అమ్మాయితో మళ్ళీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ మీడియా సోషల్ మీడియా కోడైకూసాయి. దీనిపై సుమంత్‌ స్పందిస్తూ.. తాను మళ్లీ పెళ్లి చేసుకోవడం లేదని.. ఇదంతా ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమాలో భాగంగా జరిగిందని తెలిపారు.

విడాకులు తీసుకోవడం.. మళ్లీ పెళ్లి చేసుకోవడం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని.. అలాంటి కథతో తెలుగులో సినిమా రావడం ఇదే తొలిసారి అని సుమంత్ పేర్కొన్నారు. షూటింగ్ సందర్భంగా ఎలాగో సినిమాలోని శుభలేఖ బయటికొచ్చిందని.. అదే ఈ ఊహాగానాలకు దారి తీసిందని సుమంత్‌ అన్నారు. రెండో పెళ్లి వార్తలతో కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించి.. ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.

సుమంత్ - నైనా గంగూలీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కు ''మళ్ళీ మొదలైంది'' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ముందు హత్తుకొని బెడ్ మీద పడుకొని ఉన్న సుమంత్ - నైనా మధ్య.. ఆ తర్వాత కొంచం దూరం మరింత దూరం పెరిగినట్లు చూపించారు. విడాకుల తర్వాత జీవితాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారనేది ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది.

''మళ్ళీ మొదలైంది'' చిత్రానికి టీజీ కీర్తి కుమార్ రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు. రెడ్ సినిమాస్ చరణ్ తేజ్ సమర్పణలో కె. రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. శివ జీఆర్ఎన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.