అఖిల్ 'ఏజెంట్' నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు

Tue May 17 2022 10:08:31 GMT+0530 (IST)

Akhil 'Agent' producers gave clarity

అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఏజెంట్ సినిమా విడుదల విషయంలో గత వారం రోజులుగా సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఏజెంట్ సినిమా షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉండటంతో పాటు కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రొడక్షన్ టీమ్ కు దర్శకుడు సురేందర్ రెడ్డికి విభేదాలు వచ్చాయని అందుకే ఆగస్టు లో సినిమా రావడం లేదనే వార్తలు వచ్చాయి.అఖిల్ గత చిత్రం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఏజెంట్ సినిమాపై ప్రతి ఒక్కరిలో కూడా ఆసక్తి ఉంది. పైగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ సినిమా అంటే ఖచ్చితంగా ఒక మంచి మాస్ మసాలా సినిమా వస్తుందని అక్కినేని అభిమానులు నమ్ముతున్నారు. ఇలాంటి సమయంలో వారు అఖిల్ సినిమా వివాదంలో ఉంది.. మళ్లీ వాయిదా పడబోతుంది అనే వార్తలతో గందరగోళానికి గురి అయ్యారు.

ఏజెంట్ సినిమా ఆగస్టు లో రావడం లేదు అంటూ మీడియాలో వస్తున్న వార్తలకు యూనిట్ సభ్యులు స్పందించారు. నిర్మాత అనీల్ సుంకర స్పష్టంగా మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దంటూ విజ్ఞప్తి చేశాడు. ఆయన ఖచ్చితంగా సినిమా ను ఆగస్టులోనే తీసుకు వస్తామన్న హామీని ఇచ్చారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఏజెంట్ సినిమా బడ్జెట్ విషయంలో కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

వాటన్నింటికి కూడా నిర్మాత చాలా క్లియర్ గా స్పష్టతను ఇచ్చాడు. మీడియాలో ఏజెంట్ గురించి వస్తున్న పుకార్లు నిజం కాదు.. సినిమా అన్ని అనుకున్నట్లుగా జరుగుతున్నాయి అనే స్పష్టత ఇచ్చాడు. మొత్తానికి అఖిల్ ఏజెంట్ విషయంలో అభిమానుల ఆందోళనకు.. విడుదల తేదీ పై ఉన్న గందరగోళం కు చిత్ర నిర్మాత ఒక స్పష్టత ఇవ్వడంతో పుకార్లకు చెక్ పెట్టినట్లు అయ్యింది.

ఏజెంట్ సినిమాలో అఖిల్ లుక్ రివీల్ అయిన తర్వాత అంచనాలు భారీగా పెరిగాయి. చాలా విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమా లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టీ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

అతి త్వరలోనే చివరి షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారట. దాంతో సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఆగస్టు లో చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.. వాటితో ఏజెంట్ ఏ మేరకు పోటీ పడేనో చూడాలి.