ఈరోజుల్లో 175 డేస్.. ఆయనకే ఇది సాధ్యం

Sun May 22 2022 21:00:01 GMT+0530 (India Standard Time)

Akhanda 175Days Run

ఇటీవల కాలంలో ఒక సినిమా రెండు వారాలు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆడితే భారీ విజయం.. నాలుగు వారాలు ఆడితే బ్లాక్ బస్టర్ విజయం అంటున్నారు. ఎక్కువ థియేటర్లలో విడుదల చేయడం వల్ల రెండు మూడు వారాలు మహా అయితే నాలుగు వారాలు అంతకు మించి ఏ సినిమా కూడా థియేటర్లలో ఉండటం లేదు. నాలుగు వారాలు మించి ఉందంటూ అదో అద్బుతం అన్నట్లుగా అయ్యింది.అయినా మూడు నాలుగు వారాల్లోనే ఓటీటీ లో విడుదల అవుతున్న నేపథ్యంలో నాలుగు వారాల తర్వాత థియేటర్లకు చూసేందుకు ఓ ఒక్కరు కూడా ఉండటం లేదు. అందుకే థియేటర్లలో ఎంత పెద్ద స్టార్ సినిమాలు అయినా కూడా ఈమద్య కాలంలో 50 రోజులు ఆడటం అనేది చాలా పెద్ద విషయం అయ్యింది. వందలో ఒకటి రెండు సినిమాలు అక్కడో ఇక్కడో 50 రోజులు ఆడుతున్నాయి.

ఇలాంటి సమయంలో అఖండ సినిమా ఒక థియేటర్ లో ఏకంగా 175 రోజులను పూర్తి చేసుకుంది. చిలకలూరి పేట లోని రామకృష్ణ అనే థియేటర్ లో అఖండ సినిమా 175 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని థియేటర్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించడం జరిగింది. మరో 25 రోజుల పాటు సినిమా ను ఆ థియేటర్ లో ఆడించి ఆ తర్వాత సినిమాను తొలగించే ఉద్దేశ్యంతో యాజమాన్యం ఉందని తెలుస్తోంది.

సినిమా 200 రోజులు పూర్తి అయిన తర్వాత బాలకృష్ణ ముఖ్య అతిథిగా సినిమా యొక్క 200 రోజుల వేడుక నిర్వహిస్తామని థియేటర్ యాజమాన్యం పేర్కొన్నారు. బాలయ్య మరియు బోయపాటి కాంబోలో వచ్చిన మూడవ సినిమా అఖండ. అంతకు ముందు వచ్చిన రెండు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోగా.. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇంతటి భారీ విజయం బాలయ్యకే సాధ్యం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

బాలయ్య వరుసగా పరాజయాలతో సతమతం అవుతున్న సమయంలో అఖండ సినిమా ఒక అద్బుత విజయాన్ని నమోదు చేసింది. ఆయన కెరీర్ మళ్లీ ఊపు అందుకునేలా స్పీడ్ పెంచేలా చేసింది. అందుకే అఖండ సినిమా నందమూరి అభిమానులకు చాలా ప్రత్యేకంగా నిలిచింది. భారీ అంచనాల నడుమ రూపొందిన అఖండ సినిమాకు సంబంధించిన సీక్వెల్ ను కూడా చేస్తామంటూ అప్పుడు బాలయ్య చెప్పుకొచ్చాడు.

ఇప్పటికిప్పుడు కాకున్నా కూడా అఖండ సినిమా కు సంబంధించిన సీక్వెల్ ను కొన్ని సంవత్సరాల తర్వాత అయినా చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న బాలయ్య తదుపరి సినిమాను ఎఫ్ 3 చిత్ర దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నాడు.