పూరీ 'రొమాంటిక్' రిలీజ్ డేట్ మారింది..!

Mon Oct 18 2021 16:27:39 GMT+0530 (IST)

Akash Puri Romantic Pre Poned Release Date

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ''రొమాంటిక్''. పూరీ శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ పూరీనే అందించడం విశేషం. ఇందులో ఆకాశ్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా కరోనా పరిస్థితుల ప్రభావం వల్ల వాయిదా పడుతూ వచ్చింది. చివరగా దీపావళి కానుకగా నవంబర్ 4న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు మరోసారి పూరీ మూవీ విడుదల తేదీని మార్చారు.''రొమాంటిక్'' చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 29న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఈరోజు సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆకాష్ పూరీ - కేతిక శర్మ లకు సంబంధించిన ఓ రొమాంటిక్ పోస్టర్ ని కూడా వదిలారు. దీపావళి రోజు రజినీకాంత్ 'పెద్దన్న' సినిమాతో పాటుగా మరికొన్ని మూవీస్ విడుదల ఉండటంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. కాకపోతే అక్టోబర్ 29న కూడా ఆకాష్ పోటీ ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగశౌర్య హీరోగా నటించిన 'వరుడు కావలెను' చిత్రాన్ని అదే రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్పోస్ట్ పోన్ అయిన సినిమాలన్నీ ఒక్కసారిగా థియేటర్లలోకి వస్తుండటంతో ఇలా క్లాష్ అనేది అనివార్యం అయిందని చెప్పవచ్చు.

లావణ్య సమర్పణలో పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ మరియు పూరీ కనెక్ట్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. 'ఇస్మార్ట్ శంకర్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పూరి జగన్నాధ్ - ఛార్మి కౌర్ కలిసి నిర్మిస్తున్న సినిమా ఇది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ మరియు సాంగ్స్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. నరేష్ రానా సినిమాటోగ్రఫీ అందించగా.. జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించగా.. మకరంద్ దేశ్ పాండే - ఉత్తేజ్ - సునయన ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 'మెహబూబా' తో నిరాశపరిచిన పూరీ కొడుకు ''రొమాంటిక్'' సినిమాతో సక్సెస్ అందుకుంటాడని అభిమానులు భావిస్తున్నారు.