టాలీవుడ్ దర్శకులకు అతడే ఆదర్శం కావాలి!

Sun Jul 05 2020 11:22:59 GMT+0530 (IST)

Ajay Gnanamuthu takes voluntary pay cut for Vikram-starrer Cobra

తెలుగు ప్రేక్షకులు చియాన్ ట్రీట్ మిస్సవుతున్న సంగతి తెలిసిందే. అతడు నటించిన సినిమాలు అనువాదమై వస్తున్నా.. ఇక్కడ ఆశించిన విజయం సాధించడం లేదు. ప్రస్తుతం చియాన్ విక్రమ్ `కోబ్రా` అనే ప్రయోగాత్మక కమర్షియల్ చిత్రంలో నటిస్తున్నారు. తమిళ తంబీ అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  ఇప్పటికే కోబ్రా పోస్టర్లు అభిమానుల్లోకి దూసుకెళ్లాయి. పోస్టర్ల స్థాయిలోనే బోలెడంత క్రియేటివిటీ కనబరిచిన దర్శకుడిపై ప్రశంసలు కురిసాయి. అజయ్ జ్ఞానముత్తు ఏఆర్ మురుగదాస్ శిష్యుడు. మురుగదాస్ దర్శకత్వ బృందంలో మాజీ అసోసియేట్ డైరెక్టర్ గా అతడు సుపరిచితం. విమర్శకుల ప్రశంసలు పొందిన హర్రర్ థ్రిల్లర్ `డెమోంటే కాలనీ`కి ఆయనే దర్శకుడు. నయనతార `ఇమైక్కా నోడిగల్` చిత్రం అతడి రెండో ప్రయత్నం. ప్రస్తుతం కోబ్రా అతని మూడవ చిత్రం.

తాజా సమాచారం ప్రకారం.. దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తన పారితోషికంలో 40 శాతం స్వచ్ఛందంగా తగ్గించుకునేందుకు ముందుకు వచ్చారు. కరోనా లాక్ డౌన్ వల్ల నిర్మాతలు సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న వేళ ఈ నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. తాజా నిర్ణయంతో అతడు అందరి మనసులు దోచాడు. ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల అతనికి దాదాపు రూ .1.25 కోట్ల మేర పారితోషికం తగ్గుతుందట. కోవిడ్ -19 కారణంగా ఈ కష్ట కాలంలో తన నిర్మాత లలిత్ కుమార్‌పై భారం పడకూడదని అజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అజయ్ తీరుగానే టాలీవుడ్ దర్శకులు తమ పారితోషికాల్ని తగ్గించుకుని ఆదర్శంగా నిలుస్తారేమో చూడాలి.

`కోబ్రా`లో శ్రీనిధి శెట్టి- మృణాలిని రవి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భారత మాజీ క్రికెట్ స్టార్ ఇర్ఫాన్ పఠాన్ విలన్ పాత్రను పోషించారు. ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్ రెహమాన్ ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.