అజయ్ దేవగన్ - రాశీఖన్నా డెబ్యూ వెబ్ సిరీస్ 'రుద్ర' ట్రైలర్..!

Sat Jan 29 2022 16:29:17 GMT+0530 (IST)

Ajay Devgan Rashikhanna Debut Web Series Rudra Trailer

గత రెండేళ్లలో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అనేక మంది స్టార్స్ డిజిటల్ మాధ్యమాలలో అడుగుపెట్టారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ - బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా ఓటీటీ స్పేస్ లో ఎంట్రీ ఇస్తున్నారు.అజయ్ దేవగన్ - రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో రూపొందిన లేటెస్ట్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ''రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్''. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసం రాజేష్ మపుస్కర్ ఈ సిరీస్ ను డైరెక్ట్ చేశారు. 'లూథర్' అనే బ్రిటీష్ వెబ్ సిరీస్ ఆధారంగా రూపొందించారు.

తాజాగా'రుద్ర' ట్రైలర్ ను అజయ్ దేవగన్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ''వెలుతురు చీకటి మధ్య ఉన్న లైన్ వద్ద నేను నివసిస్తుంటాను. #రుద్ర తో చీకటి అంచు వరకు ప్రయాణించడానికి సిద్ధంగా ఉండండి'' అని మేకర్స్ పేర్కొన్నారు.

'రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్' ట్రైలర్ విషయానికొస్తే.. భయంకరమైన కిల్లర్ లను పట్టుకోవడంలో పేరు మోసిన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. అయితే తన భార్యతో విడిపోవడంతో వ్యక్తిగత జీవితం సాఫీగా సాగలేదని తెలుస్తోంది. అజయ్ భార్యగా ఈషా డియోల్ కనిపించింది.

నగరంలో జరుగుతున్న హత్యలను ఛేదించే క్రమంలో ఒక పోలీసాఫీసర్ కు ఎదురయ్యే సవాళ్ళను 'రుద్ర' వెబ్ సిరీస్ లో చూపించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఇందులో రాశీ ఖన్నా లుక్ డిఫరెంట్ గా ఉంది. ఆమె పాత్రకు సంబంధించి ఏదో ట్విస్ట్ ఉంటుందేమో అనే సందేహాలు కలిగిస్తోంది.

అతుల్ కులకర్ణి - అశ్విని కల్సేకర్ - తరుణ్ గెహ్లాట్ - ఆశిష్ విద్యార్థి మరియు సత్యదీప్ మిశ్రా ఇందులో ఇతర కీలక పాత్రల్లో నటించారు. రుద్ర ట్రైలర్ లో విజువల్స్ మరియు బీజీఎం హైలైట్ గా నిలిచాయి.

అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ మరియు బీబీసీ స్టూడియోస్ సంస్థలు కలిసి ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ని నిర్మించాయి. 'రుద్ర' విడుదల తేదీని డిస్నీ+హాట్ స్టార్ ఇంకా ప్రకటించలేదు. త్వరలో హిందీ తమిళం తెలుగు కన్నడ మరాఠీ మలయాళం మరియు బెంగాలీ భాషల్లో ప్రసారం అవుతుంది.