Begin typing your search above and press return to search.

సినిమా ఈవెంట్స్ అన్నీ ఇకపై ఆన్లైన్ చేసుకోవాల్సిందేనా...?

By:  Tupaki Desk   |   4 Aug 2020 11:30 AM GMT
సినిమా ఈవెంట్స్ అన్నీ ఇకపై ఆన్లైన్ చేసుకోవాల్సిందేనా...?
X
కరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. దీంతో సినిమా షూటింగ్స్ ఆగిపోయి థియేటర్స్ క్లోజ్ అయ్యాయి. థియేటర్స్ లో బొమ్మపడక నాలుగున్నర నెలలు అయింది. సినిమాపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ మధ్య కొన్ని షరతులతో ప్రభుత్వాలు షూటింగ్స్ కి మరియు మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేసుకోడానికి అనుమతించారు. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తి చేసుకొని ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లలో రిలీజ్ చేస్తున్నారు.

ఐతే ఒకప్పుడు సినిమా వస్తుందంటే ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు ఏదో ఒక ఫంక్షన్ చేస్తూ మూవీని ప్రమోట్ చేసుకునే వారు. ఈ వేడుకలు నిర్వహణకు మేకర్స్ భారీగానే ఖర్చు చేసి ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకు ఫంక్షన్ బాధ్యతలు అప్పగించేవారు. ప్రముఖ యాంకర్స్ ని పిలిచి హోస్ట్ చేపించేవారు. తమ అభిమాన నటీనటులను చూడటానికి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలి వచ్చి కరతాళధ్వనులతో సందడి సందడి చేసేవారు. కానీ మహమ్మారి వైరస్ వల్ల ఇప్పుడు పరిస్థితులు మారాయి. సినిమా ఆడియో వేడుకలు.. ప్రీ రిలీజ్ ఈవెంట్లు చూసి చాన్నాళ్ళై పోయింది. ఇకపై అలాంటి ఈవెంట్స్ చూడబోతున్నామో లేదో అనే సందేహాలు మొదలయ్యాయి.

కాగా సుమారు ఐదు నెలలుగా సినిమా ఈవెంట్లు లేకపోవడంతో ఆన్ లైన్‌ లోనే అలాంటి ప్రోగ్రామ్స్ చేసే పద్ధతికి డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' శ్రీకారం చుట్టింది. ఈ మధ్య పలు సినిమాలను 'ఆహా'లో డైరెక్టుగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా సినిమాలను చూస్తున్న ప్రేక్షకులకు ఆన్లైన్ ద్వారా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. దీని కోసం ప్రముఖ యాంకర్ సుమతో జూమ్ యాప్ ద్వారా యాంకరింగ్ చేపిస్తూ.. చిత్ర యూనిట్ తో మాట్లాడిస్తూ మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో 'ఆహా' ఓటీటీలో విడుదల కాబోతున్న ''బుచ్చి నాయుడు కండ్రిగ.. తూర్పు వీధి'' అనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాన్ని ఆన్ లైన్ ద్వారా నిర్వహించారు సుమ. ఈ కార్యక్రమానికి యాంకర్ సుమ హోస్ట్ చేయడమే కాకుండా ప్రముఖ నిర్మాత దిల్ రాజు‌ని గెస్ట్ గా ఇన్వైట్ చేసారు. ఈ ఆన్లైన్ కార్యక్రమంలో సినిమా దర్శకనిర్మాతలు లైవ్‌ లోకి మాట్లాడారు. దిల్ రాజు‌ చేతులమీదుగా మూవీ పోస్టర్ ని రిలీజ్ చేసారు. దిల్ రాజు మాట్లాడుతూ.. హీరోహీరోయిన్లతో పాటు దర్శకనిర్మాతలు అంతా కొత్తవాళ్లతో చేసిన ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.

ఇక ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ.. ''ఈ మధ్య కాలంలో సినిమా ఈవెంట్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఏం లేవు.. ఇంకొంత కాలం పరిస్థితి ఇలాగే ఉండబోతోంది. సో అందుకే ఆన్ లైన్‌ లో ఈవెంట్స్ చేయడం మొదలుపెట్టా. మీరు కూడా రెడీగా ఉండండి.. మీరో ఎవర్నొకర్ని పిలిచి కొత్త సాంగ్ లాంచ్ చేయండి అని అడగొచ్చు'' అని చెప్పుకొచ్చారు. సుమ మాట్లాడింది సరదాకే అయినప్పటికీ ఇది నిజమే అనిపిస్తుంది. కరోనా పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో నార్మల్ సిచ్యుయేషన్స్ వచ్చేలా కనిపించడం లేదు. సినిమాలను డైరెక్ట్‌గా ఓటీటీలో చూడటమే కాకుండా.. సినిమా ఈవెంట్స్ కూడా ఆన్ లైన్‌ లోనే నిర్వహించనున్నారు.