Begin typing your search above and press return to search.

అఘోరాలకు అఖండ పూనకాలు

By:  Tupaki Desk   |   4 Dec 2021 1:08 PM GMT
అఘోరాలకు అఖండ పూనకాలు
X
అఘోరా. ఈ పదం ఈ మధ్య కాలం వరరకూ ఎవరికీ తెలియనిది. ఆధ్యాత్మిక భావనతో ఉన్న వారికి మాత్రమే తెలిసిన పదమిది. కాశీలో అఘోరాలు, అఖండలు ఎక్కువగా కనిపిస్తారు. గంగ ఒడ్డున వారు జపతపాలు చేస్తూ తిరుగాడుతుంటారు. అలాగే శివాలయాల సమీపంలో కూడా వారు ఉంటారు. ఇదంతా ఎందుకు అంటే అఘోరాలు జన జీవన స్రవంతికి దూరంగా ఉంటారని చెప్పడానికి. అలాంటి అఘోరాలను ఏకంగా సినిమా థియేటర్ల దాకా రప్పించిన గొప్పతనం నిజంగా బాలయ్య బాబుదే అనాలి.

విశాఖ జిల్లా నర్శీపట్నం బంగారాజు థియేటర్లో అఖండ సినిమా ప్రదర్శన సాగుతోంది. టికెట్ల కోసం అభిమానులు క్యూ కట్టారు. అదే వరసలో పెద్ద సంఖ్యలో అఘోరాలు సైతం సినిమా చూసేందుకు టికెట్ లైన్లలో నిలుచోవడం అందరికీ షాకింగ్ గా అనిపించింది. వారు సినిమా చూడడానికి రావడమే విడ్డూరం అయితే సినిమా చూస్తూ ఆనందానికి లోను కావడం మరో విశేషం.

సినిమాలో సెకండ్ హాఫ్ లో అఖండ పాత్ర మొదలవుతుంది. అక్కడ నుంచి అఘోరాలు సినిమాను చూస్తూ పూర్తి తన్మయత్వంలో మునిగితేలారు. అనంతరం వారు బాలయ్య అభిమానులతో కూడా ముచ్చటిస్తూ మంచి సినిమా తీశారు అని చెప్పడం జరిగింది. కాగా అఖండ సినిమాకు అఘోరాలు రావడంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ గా ఉన్నారు.

తమ హీరో నటించిన మూవీ అంటే ప్రకృతి సైతం పులకిస్తుందని, ఆ ప్రకృతిలో భాగమై జీవించే అఘోరాలు సైతం సినిమా థియేటర్ రావడం అంటే బాలయ్య పెర్ఫార్మెన్స్ వల్లనే అంటున్నారు. అఘోరాలకు మూవీ నచ్చింది అంటే ఇంతకంటే రికార్డ్ బ్రేక్ ఏముంటుందని వారు అంటున్నారు. మొత్తానికి అఖండమైన విజయానికి అర్ధం ఇదే అని సినీ ప్రియులు కూడా విశ్లేషిస్తున్నారు. మరో వైపు ఆధ్యాత్మికపరులు, స్వాములు కూడా ఇలాంటి సినిమాల వల్లనే భక్తి భావం వెల్లివిరుస్తుందని, ధర్మం నిలుస్తుందని చెబుతున్నారు.