Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ

By:  Tupaki Desk   |   21 Jun 2019 9:53 AM GMT
మూవీ రివ్యూ : ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
X
చిత్రం : ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ

నటీనటులు: నవీన్ పొలిశెట్టి-శ్రుతి శర్మ-సుహాస్-సందీప్ తదితరులు
సంగీతం: మార్క్ కె.రాబిన్
ఛాయాగ్రహణం: సన్నీ కూరపాటి
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్క
స్క్రీన్ ప్లే: స్వరూప్-నవీన్ పొలిశెట్టి
కథ-మాటలు-దర్శకత్వం: స్వరూప్

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’.. ‘1 నేనొక్కడినే’ లాంటి సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ తో ఆకట్టుకున్న యువ నటుడు నవీన్ పొలిశెట్టి హిందీలో టీవీ షోలు.. వెబ్ సిరీస్ లతో మంచి పేరే సంపాదించాడు. రచ్చ గెలిచిన అతను ఇప్పుడు ఇంట గెలిచే ప్రయత్నంలో భాగంగా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంలో హీరోగా నటించాడు. కొత్త దర్శకుడు స్వరూప్ రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: డిటెక్టివ్ అని చెబితే.. అంటే ఏంటి అని అడిగే నెల్లూరులో ‘ఎఫ్బీఐ’ పేరుతో ఒక డిటిక్టివ్ ఏజెన్సీ నడుపుతుంటాడు ఆత్రేయ (నవీన్ పొలిశెట్టి). కానీ అతడిని నమ్మి ఎవరూ కేసులు ఇవ్వరు. చిన్నా చితకా కేసులతో ఏదో అలా నెట్టుకొస్తున్న అతడికి అనుకోకుండా ఒక ఇంట్రెస్టింగ్ కేసు తగులుతుంది. కొన్ని హత్యలతో ముడిపడ్డ ఆ కేసులో తీగ లాగితే డొంక కదులుతుంది. ఈ లోపు ఆత్రేయనే మర్డర్ కేసులో చిక్కుకుంటాడు. పెద్ద కుట్రతో తనను ఈ కేసులో ఇరికించారని ఆత్రేయకు అర్థమవుతుంది. ఈ స్థితిలో అతను ఈ హత్యల వెనుక రహస్యాన్ని ఎలా ఛేదించాడు.. తాను ఇరుక్కున్న కేసు నుంచి ఎలా బయటపడ్డాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ట్రైలర్ చూస్తే ఇది కామెడీ ప్రధానంగా సాగే ‘చంటబ్బాయ్’ తరహా సినిమాలా అనిపించింది. మర్డర్ మిస్టరీ సబ్ ప్లాట్ లాగా కనిపించింది. కానీ సినిమా అందుకు భిన్నంగా ఉంటుంది. ప్రథమార్ధంలో కాసేపు ఏదో అలా కామెడీగా నడిపించేసి.. ఒక అన్ బిలీవబుల్ మిస్టరీ చుట్టూ కథను నడిపారు. బహుశా ఇలాంటి పాయింట్ తెలుగు సినిమాల్లోనే కాదు.. ఇండియాలో మరే భాషా చిత్రాల్లోనూ కూడా చూసి ఉండం. ఇలా కథ అల్లుకున్నందుకు.. దాన్ని సాధ్యమైనంత వరకు ఆసక్తికరంగా చెప్పినందుకు.. ప్రేక్షకుల్ని షాక్‌కు గురి చేయగలిగినందుకు చిత్ర బృందాన్ని అభినందించాలి. ఈ బడ్జెట్లో ఇలాంటి కథతో సినిమా చేయాలనుకోవడం పెద్ద సాహసమే. ఎన్నో లేయర్స్ ఉన్న కథ.. దాన్ని చెప్పేందుకు రాసుకున్న బిగువైన కథనం.. ప్రధాన పాత్రలో నవీన్ పొలిశెట్టి ఎఫర్ట్ లెస్ పెర్ఫామెన్స్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’కు ప్రధాన ఆకర్షణలు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు కచ్చితంగా చూడదగ్గ సినిమా ఇది.

ఐతే చాలా కొత్తగా.. సెన్సేషనల్ గా అనిపించే కథ.. ఈ చిత్రానికి బలమే కాదు.. బలహీనతగా కూడా అనిపిస్తుంది. ఈ కథ థ్రిల్ చేస్తుంది కానీ.. అంత నమ్మశక్యంగా అనిపించదు. అనుకున్నంత కన్విన్సింగ్ గా దీన్ని చెప్పలేకపోయారు. రియలిస్టిక్ ఫీలింగ్ కలిగేలా సినిమాను నడిపించి.. ‘బిలీవబిలిటీ’ తక్కువగా ఉన్న కథను ఎంచుకోవడంతో ప్రేక్షకులు అనుకున్నంత స్థాయిలో థ్రిల్ కాలేని పరిస్థిితి తలెత్తుతుంది. దీనికి తోడు ఇలాంటి కథను కొంచె పెద్ద కాన్వాస్‌ లో.. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో చేయాల్సింది. దానికి ఒక బిల్డప్ జోడించాల్సింది. కానీ దీన్ని ఒక షార్ట్ ఫిలిం స్థాయి ప్రమాణాలతో నిర్మించడం.. మరీ సటిల్ గా కథను చెప్పే ప్రయత్నం చేయడం వల్ల సినిమా తాలూకు ఎఫెక్ట్ అనేది అనుకున్న స్థాయిలో కనిపించలేదు.

ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు చూస్తే ‘ఆత్రేయ’ పాత్రలో ‘చంటబ్బాయ్’ టచ్ కనిపిస్తుంది. లైట్ హార్టెడ్ హ్యూమర్ తో ఆత్రేయ పాత్ర పరిచయ సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి. ఐతే అసలు కథ మొదలు కావడానికి ముందు ఆత్రేయ కొంచెం బోర్ కొట్టిస్తాడు. కథలో తొలి మలుపు రావడానికి ముందు సన్నివేశాలు కొంచెం నెమ్మదిగా నడుస్తాయి. కానీ తర్వాత మాత్రం ‘ఆత్రేయ’ ఆద్యంతం ప్రేక్షకుల్ని గెస్సింగ్ లో ఉంచుతూ.. ఉత్కంఠ కలిగిస్తూ ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తుంది. కథలోని లెక్కలేనన్ని మలుపులకు ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. స్క్రీన్ ప్లే విషయంలో నవీన్-స్వరూప్ పడ్డ కష్టం తెరమీద కనిపిస్తుంది. ఒక్క నిమిషం పాటు సినిమా నుంచి డీవియేట్ అయినా.. ఏదో ఒక ఇంట్రెస్టిింగ్ పాయింట్ మిస్సయ్యే లాగా ఆసక్తికరంగా కథనాన్ని తీర్చిదిద్దారు. కాకపోతే ఉత్కంఠభరిత మలుపులతో ఇంటర్నేషనల్ లెవెల్ ఉన్న కంటెంట్ కు తగ్గ కాన్వాస్ లేని వెలితి మాత్రం ప్రేక్షకులని వెంటాడుతుంది.

చివరి అరగంటలో ‘ఆత్రేయ’ ప్రేక్షకుల్ని విస్మయానికి గురి చేస్తాడు. సస్పెన్స్ రివీల్ చేసే సమయంలో థ్రిల్ అవుతూనే.. నిజంగా ఇలా జరుగుతుందా అనే సందేహం మిశ్రమానుభూతికి గురి చేస్తుంది. కథ.. దాన్ని చెప్పిన విధానం ఇంకాస్త సింపుల్ గా ఉంటే బాగుండేదన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. పాటలు లేకుండా ఒక థ్రిల్లర్ మూవీని రెండున్నర గంటల నిడివితో చెప్పడం సినిమాకు ప్రతికూలతే. ప్రేక్షకులు కొంచెం అలసిపోయేలా చేస్తుంది నిడివి. కొన్ని అనవసర సన్నివేశాల్ని తీసేసి.. కాంప్లెక్సిటీ కొంచెం తగ్గించి ఉంటే.. ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం ఉన్నత స్థాయిలో ఉండి ఉంటే ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ రేంజే వేరుగా ఉండేది. కొన్ని ప్రతికూలతలున్నప్పటికీ కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు మాత్రం కచ్చితంగా చూడదగ్గ సినిమానే ఇది.

నటీనటులు: నవీన్ పొలిశెట్టి ఎంత మంచి పెర్ఫామరో అతను చేసిన చిన్న చిన్న పాత్రలు.. వెబ్ సిరీస్‌లు చూస్తేనే అర్థమవుతుంది. హీరోగా తన లాంచింగ్ కు అతను ప్రత్యేకమైన పాత్రను ఎంచుకుని.. దానికి నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. కొన్ని నిమిషాల్లోనే ఆత్రేయ పాత్రను ఓన్ చేసుకునేలా చేయడం అతను ఆ పాత్రలో ఎలా రాణించడానడానికి ఉదాహరణ. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా.. హీరోగా చేస్తన్నది తొలిసారే అయినా.. అతనేమీ కొత్తగా అనిపించడు. అలవాటైన నటుడిలా కనిపిస్తాడు. ఆద్యంతం ఒక ఈజ్ తో అలవోకగా ఆత్రేయ పాత్రను చేసుకెళ్లిపోయాడు నవీన్. పెర్ఫామెన్స్ పరంగా వేలెత్తి చూపించడానికి ఏమీ లేదు. హీరో అసిస్టెంట్ పాత్రకు శ్రుతి శర్మ సూటయ్యింది. ఆమె మరీ ప్రత్యేకంగా అనిపించలేదు కానీ.. పాత్రకు తగ్గ పెర్ఫామెన్స్ ఇచ్చింది. ‘మజిలీ’లో ఆకట్టుకున్న సుహాస్ మరోసారి మంచి పెర్ఫామెన్స్ ఇచ్చాడు. విలన్ పాత్రల్లో నటించిన ఆర్టిస్టులు బాగానే చేసినప్పటికీ వాళ్లు వాటికి సూటవ్వలేదనిపిస్తుంది. మిగతా ఆర్టిస్టులు ఓకే.

సాంకేతిక వర్గం: చిన్న బిట్ సాంగ్ మినహాయిస్తే పాటలు లేని ఈ చిత్రంలో నేపథ్య సంగీతంతో మార్క్ కె.రాబిన్ ఆకట్టుకున్నాడు. సినిమా శైలికి తగ్గ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ ఓకే. కొత్త దర్శకుడు.. కొత్త హీరోతో ఇలాంటి సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ నక్కను అభినందించాల్సిందే కానీ.. ఈ కథకు తగ్గ నిర్మాణ విలువలు అయితే సినిమాలో కనిపించలేదు. బడ్జెట్ పరిమితులు సినిమా స్థాయిని తగ్గించేశాయి. రైటర్ కమ్ డైరెక్టర్ `స్వరూప్ తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకున్నాడు. కథ విషయంలో అతను ఎంతో కొత్తగా ఆలోచించాడు. నవీన్ తో కలిసి అతను రాసిన స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకుంది. దర్శకత్వ పరంగానూ ప్రతిభ చూపించాడు. కాకపోతే.. నరేషన్ విషయంలో మరీ అంత సటిల్ గా వెళ్తే కష్టం. కొంచెం జోష్ జోడించాల్సింది.

చివరగా: ఏజెంట్ ఆత్రేయ.. థ్రిల్ చేస్తాడు

రేటింగ్ - 3/5