Begin typing your search above and press return to search.

మరో సీక్వెల్ పై గురిపెట్టిన అడివి శేష్.. 'హిట్' ఖాయమేనా?

By:  Tupaki Desk   |   6 Dec 2022 8:56 AM GMT
మరో సీక్వెల్ పై గురిపెట్టిన అడివి శేష్.. హిట్ ఖాయమేనా?
X
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘పంజా’ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించిన అడివి శేష్ టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ తొలినాళ్లలో విలన్ క్యారెక్టర్స్ కే పరిమితమైన అడివి శేష్ తనలోనూ హీరోయిజం ఉందని చాటుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ‘క్షణం’..‘అమీతుమీ’.. ‘గూఢచారి’.. ‘ఎవరు’.. ‘మేజర్’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ పోతున్న అడవి శేష్ తాజాగా ‘హిట్-2’ మూవీతో మరోసారి అభిమానులను పలుకరించాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ‘హిట్ ది సెకండ్ కేస్ ’ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తో రన్ అవుతోంది. ఈ చిత్రం విజయంతో అడవి శేష్ తన కెరీర్లో డబుల్ హట్రిక్ సొంతం చేసుకున్నాడు.

‘హిట్-2’ సక్సెస్ తో ఫుల్ జోష్ మీదున్న అడవి శేష్ తన తదుపరి మూవీపై ఫోకస్ పెట్టాడు. ‘గూఢచారి’కి సీక్వెల్ గా ‘గూఢచారి-2’ను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ మేరకు దర్శకుడు శశి కిరణ్ టిక్కాతో మరోసారి కలిసి పని చేసేందుకు సిద్ధమవుతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులను దర్శకుడు శశి కిరణ్ టిక్కా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

‘గూఢచారి’ మొదటి పార్ట్ థియేటర్స్.. ఓటీటీ.. శాటిలైట్ పరంగా మంచి బిజినెస్ చేసింది. దీంతో సెకండ్ పార్ట్ గా రాబోతున్న ‘గూఢచారి-2’ సైతం ఇదే రేంజులో బిజినెస్ చేస్తుందని అడివి శేష్ నమ్మకం పెట్టుకున్నాడు. ఈ సినిమాను కూడా ‘గూఢచారి’ డైరెక్టర్ శశి కిరణ్ టిక్కానే తెరకెక్కించనుండటంతో రెండో పార్ట్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

ప్రస్తుతం అడవి శేష్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ‘గూఢచారి-2’ కథలో పలు కీలక మార్పులు చేశారని తెలుస్తోంది. త్వరలోనే సైట్స్ పైకి వెళ్లబోతున్న ఈ సినిమాపై అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకుంటున్నారు.

మరోవైపు నాని లీడ్ రోల్ లో నటించనున్న ‘హిట్-3’లోనూ అడివి శేష్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. వరుస హిట్లతో దూసుకెళ్తున్న అడివి శేష్ తో సినిమాలు చేసేందుకు బడా నిర్మాతలు క్యూ కడుతున్న సెలెక్టివ్ కథలతోనే ముందుకెళుతున్నాడు.