Begin typing your search above and press return to search.

ఛాన్స్ లు ఇవ్వట్లేదని ఆమె విలన్ గా మారిందా..?

By:  Tupaki Desk   |   4 April 2020 11:50 AM GMT
ఛాన్స్ లు ఇవ్వట్లేదని ఆమె విలన్ గా మారిందా..?
X
తెలుగు ఇండస్ట్రీలో వేరే ఇండస్ట్రీ నుండి వచ్చి సెటిల్ అవుతున్న హీరోయిన్లలో అతిధి రావు హైదరి ఒకరు. అందం అభినయంతో వరుసగా సినీ అవకాశాలు దక్కించుకుంటున్న హైదరి ప్రస్తుతం నాని - సుధీర్ బాబు హీరోలుగా రూపొందుతున్న 'వి' సినిమాలో నటిస్తుంది. తెలుగులో హైదరిని స్ట్రెయిట్ హీరోయిన్ గా సమ్మోహనం సినిమాతో పరిచయం చేసిన డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి మళ్లీ 'వి'లో అవకాశం ఇచ్చారు. హీరో నాని-డైరెక్టర్ మోహన్ కృష్ణ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నివేత థామస్ నటిస్తుంది. మొదటి నుండి కూడా ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే మొదటిసారి హీరో నాని విలన్ గా కనిపించనున్నాడట.

ఇక ప్రస్తుతం ఈ సినిమాలో హైదరి పాత్ర గురించి సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. 'వి' సినిమాలో ఈ హైదరాబాది హాట్ బ్యూటీ విలన్ గా కన్పించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి బాలీవుడ్ లో - తమిళంలో వరుస సినిమాలతో బిజీ అవుతున్న హైదరి తెలుగులో మాత్రం అడపాదడపా సినిమాలు చేస్తోంది. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ సైతం కుళ్ళుకునేలా ఉన్న హైదరి ఫిగర్ కి సరైన పాత్రలు పడట్లేదనే చెప్పాలి. స్టార్ హీరోయిన్స్ లోటు తీర్చడానికి హైదరి సిద్దంగా ఉన్నప్పటికీ అమ్మడు తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేక పోతుంది. మరి హైదరాబాదులో పుట్టిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో గ్లామరస్ క్యారెక్టర్స్ తో మెల్లగా నెట్టుకొస్తోంది. మరి తెలుగులో ఈ అమ్మడిని ఎందుకు పట్టించుకోవట్లేదు.. అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.