ఆది - నిక్కీ మెహందీ ఫంక్షన్ ఫోటోలు వైరల్..!

Wed May 18 2022 15:02:40 GMT+0530 (India Standard Time)

Adi Nicki Mehndi Function Photos Viral

సినీ ఇండస్ట్రీలో మరో ప్రేమజంట పెళ్లి పీటలు ఎక్కబోతుంది. గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న టాలెంటెడ్ యాక్టర్ ఆది పినిశెట్టి - హీరోయిన్ నిక్కీ గల్రాని జంట ఈరోజు (మే 18) వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు.ఈ నేపథ్యంలో పెళ్లికి ముందు వీరి మెహందీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆది - నిక్కీ జంట కుటుంబ సభ్యుల మధ్య ఎంతో సంతోషంగా మెహందీ ఫంక్షన్ చేస్తుకున్నారని తెలుస్తోంది.

కాబోయే వధూవరులిద్దరూ పసుపు నీళ్లలో తడిసి ముద్దయి ఉండటాన్ని గమనించవచ్చు. ఈ ఫోటోలను చూసిన అభిమానులు జంట చాలా చూడముచ్చటగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

ఆది పినిశెట్టి - నిక్కీ గల్రాని మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న నేపథ్యంలో.. తమ ప్రేమని దృవీకరిస్తూ మార్చి నెలలో నిశ్చితార్థం చేసుకున్నారు.

ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ వివాహ బంధంతో ఏడడుగులు నడవడానికి సిద్దమైనట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమం కుటుంబ సభ్యుల మధ్యన సింపుల్ గా జరగగా.. టాలీవుడ్ నుండి హీరో నాని - ప్రముఖ డిజైనర్ నీరజ కోన హాజరయ్యారు.

ఈ క్రమంలో నేడు ఆది - నిక్కీ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీ కపుల్ కి సినీ అభిమానులు మరియు ఇండస్ట్రీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఆది పినిశెట్టి - నిక్కీ గల్రాని కలిసి గతంలో 'యాగవరాయినుం నా కాక్క’ అనే తమిళ సినిమాలో నటించారు. ఇది తెలుగులో ‘మలుపు’ పేరుతో విడుదలైంది. అలానే 'మరకతమణి' సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది.

మూడేళ్ళ ప్రేమ తర్వాత జీవితంలో ఒకరికొకరు తోడుగా ఉండటం అత్యున్నతమైన విషయమని భావించిన ఆది-నిక్కీ జంట.. ఈరోజు ఏడడుగులు నడవబోతున్నారు. 39 ఏళ్ల ఆది - 30 ఏళ్ళ నిక్కీ గల్రాని కలిసి సంతోషంగా జీవించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

తెలుగువాడైన ఆది పినిశెట్టి.. కెరీర్ ప్రారంభం నుంచీ వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు విలన్ పాత్రలు చేయడానికి వెనుకాడటం లేదు. నిక్కీ సైతం తెలుగు తమిళ భాషల్లో పలు చిత్రాలతో మెప్పించింది. మరి పెళ్లి తర్వాత నటన కొనసాగిస్తుందో లేదో చూడాలి.