వీడియో సాంగ్: అదేంటో గానీ అంటున్న నాని

Thu Mar 21 2019 18:00:49 GMT+0530 (IST)

Adhento Gaani Vunnapaatuga Song Teaser from Nani Jersey Movie

న్యాచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'జెర్సీ'.  ఏప్రిల్ 19 న ఈ సినిమా రిలీజ్ అవుతోంది.  విడుదల తేదీ దగ్గరకు వస్తుండడంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. హోలీ సందర్భంగా ఈ సినిమా నుండి 'అదేంటో గాని ఉన్నపాటుగా' అంటూ సాగే సాంగ్ టీజర్ ను ఈరోజు విడుదల చేశారు.ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.  ఈ పాటకు సాహిత్యం అందించిన వారు కృష్ణ కాంత్ అనిరుధ్ ఈ పాటను స్వయంగా పాడడం జరిగింది.  పాట లిరిక్స్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి.. ట్యూన్.. అనిరుధ్ గానం కూడా మెలోడియస్ గా సాగడంతో వెంటనే ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుంది. ఇక ఈ పాట లో హైలైట్ మాత్రం రొమాంటిక్ విజువల్స్. నాని కోసం తలుపు తడుతూ అర్జున్ అని పిలుస్తుంటే.. ముద్దివ్వమని హీరోయిన్ శ్రద్ధ ను అడుగుతూ చేసే అల్లరి ఎవరినైనా గిలిగింతలు పెడుతుంది. తీరా ముద్ధిచ్చిన తర్వాత 'నేను పెడతానన్నాను' అని మెలిక పెట్టి చిలిపిగా నవ్వినప్పుడు మనకు నాని ఎంత న్యాచురల్ యాక్టరో మరోసారి తెలుస్తుంది.  ఇదొక్క సీనే కాదు  'నేను స్నానం చేసి వస్తా.. పెళ్లి చేసుకుందాం' అంటూ షాక్ ఇచ్చే డెసిషన్ ను ఒక్క క్షణంలో తీసుకునే సీన్ కూడా అల్టిమేట్. నిజానికి ఈ సాంగ్ టీజర్ లో ఉన్న షాట్స్ ఒక్కొక్కటి వివరించుకుంటూ పోతే చాట భారతం అయ్యేలా ఉంది.

సరే.. ఇవన్నీ పక్కన పెడితే మన న్యాచురల్ స్టార్ స్లోగా రౌడీగారిలా ముద్దుల హద్దులు చేరిపేయాలని కంకణం కట్టుకున్నాడా ఏంటి? చూస్తుంటే విజయ్ దేవరకొండ రూటును ఫాలో అవుతూ ఉన్నట్టుగా ఉంది. ఇప్పటివరకూ ముద్దులకు కాస్త దూరంగా ఉంటూ 'ఫ్యామిలీ హీరో' ట్యాగ్ తెచ్చుకున్న నాని విజయ్ ఇన్స్పిరేషన్ తో వారికి కాస్త ఇబ్బంది కలిగించేలాగానే ఉన్నాడు. సరే.. ఫ్యామిలీ ఆడియన్స్ అయినా  ఏం చేస్తారు.. ట్రెండ్ అని సరిపెట్టుకుంటారు.  ఇంకా ఆలస్యం ఎందుకు నాని అల్లరి చూసేయండి.