Begin typing your search above and press return to search.

190 కోట్ల బంగ్లా.. అంతా ఫేక్ అనేసిన ఊర్వ‌శి మ‌మ్మీ

By:  Tupaki Desk   |   3 Jun 2023 10:01 AM GMT
190 కోట్ల బంగ్లా.. అంతా ఫేక్ అనేసిన ఊర్వ‌శి మ‌మ్మీ
X
మాజీ మిస్సు.. అందాల క‌థ‌నాయిక‌ ఊర్వ‌శి రౌతేలా ఆస్తుల గురించి మీడియాలో స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇటీవ‌ల బాలీవుడ్ మీడియా ఈ అమ్మ‌డి విలాసాల భ‌వంతి గురించి ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వండి వార్చింది. జుహూలోని ఒక కొత్త ఇంట్లోకి మారిన ఊర్వ‌శి పై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు ప్ర‌చారం అయ్యాయి. దివంగత లెజెండ‌రీ నిర్మాత యష్ చోప్రా ఇంటి పక్కనే ఉన్న అత్యంత విలాస‌వంత‌మైన‌ బంగ్లా ని దాదాపు రూ. 190 కోట్లకు ఊర్వ‌శి రౌతేలా కొనుగోలు చేసింద‌ని ప్ర‌చారమైంది. అయితే ఈ వార్త ఫేక్ అని ఆమె తల్లి మీరా తాజాగా పేర్కొంది. మీడియా క‌థ‌నాలు అవాస్త‌వమ‌ని ఆమె పేర్కొన్నారు.

ఇంత‌కీ మీడియా ఏమ‌ని ప్ర‌చారం చేసింది? అంటే.. నాలుగు అంతస్తుల విస్తీర్ణంలో ఉన్న ఒక‌ రాజభవనంలోకి ఊర్వ‌శి త‌న కుటుంబంతో ప్ర‌వేశిస్తోంది. సువిశాల‌మైన ఈ బంగ్లాలో స‌క‌ల సౌక‌ర్యాలు అందుబాటులో ఉన్నాయి. అతిథులను అలరించడానికి తగినంత స్పేస్ కూడా ఉంది. బంగ్లా వెలుపలి భాగం అధునాతన సాంకేతిక‌త‌తో తీర్చిదిద్దారు. అయితే లోపలి భాగం ఆధునిక సౌందర్యం మైమ‌రిపించే శోభతో కూడిన సంపూర్ణ సమ్మేళనం అంటూ చాలా క‌థ‌నాలు ప్ర‌చారం చేసారు. అంతే కాదు బంగ్లాలో విలాసవంతమైన గార్డెన్.. వ్యక్తిగత వ్యాయామశాల .. భారీ పెరడు కూడా ఉన్నాయని ప్ర‌చారం సాగించారు.

అయితే ఈ వార్తల స్క్రీన్ షాట్ల‌ను షేర్ చేస్తూ ఊర్వ‌శి త‌ల్లి గారైన‌ మీరా `ఫేక్` అని ఓవర్ రైట్ చేసారు. ``ఇన్షా అల్లాహ్.. అలాంటి రోజు త్వరలో వస్తుంది.. అన్ని న్యూస్ ఛానెళ్ల‌ ప్రార్థనలు అంగీకరించబడతాయి..అమీన్`` అని క్యాప్షన్ ఇచ్చింది. నిజానికి ఊర్వశి రౌతేలా ఆశించిన స్టార్ డ‌మ్ ని ఇంకా అందుకోలేదు. టాప్ మోడ‌ల్ గా .. న‌టిగా అడ‌పాద‌డ‌పా వ‌స్తున్న అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకునే ప్ర‌యత్నంలో ఉంది. ప్ర‌ధాన స్ర‌వంతి లో ఏల్తున్న క‌థానాయిక‌ల స్థాయికి ఎద‌గాలంటే అది అంత సులువేమీ కాదు. అలాంటిది 190కోట్ల విలువ చేసే బంగ్లాను సొంతం చేసుకోవ‌డం అంటే ఆషామాషీనా? అది విరాట్ కోహ్లీ భార్యామ‌ణి అనుష్క శ‌ర్మ‌కే సాధ్యం కాలేదు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... ఊర్వశి ప్రస్తుతం ఆన్ లైన్ లో ప్రసారం అవుతున్న `ఇన్ స్పెక్టర్ అవినాష్`లో న‌టించింది. రణదీప్ హుడా ఇందులో క‌థానాయ‌కుడు. ఇటీవలే కేన్స్ 2023 రెడ్ కార్పెట్ పై నడిచి ఫ్రెంచ్ రివేరాలోను ఊర్వ‌శి సంద‌డి చేసింది. రెడ్ కార్పెట్ పై బోల్డ్ బ్లూ లిప్ స్టిక్ ఫెద‌ర్ తో తీర్చిదిద్దిన‌ నీలిరంగు గౌనుతో ఇంటర్నెట్ ను బ్రేక్ చేసింది. అంతేకాదు.. మొదటి రోజు ర్యాంప్ వాక్ లో ఎంపిక చేసుకున్న డిజైన‌ర్ డ్రెస్.. దానికి ఒక చమత్కారమైన మొసలి (ఎలిగేట‌ర్) నెక్లెస్ కాంబినేష‌న్ ధరించి హెడ్ ట‌ర్న‌ర్ గా మారింది.