డబ్బే కావాలంటున్న `కేజీఎఫ్` బ్యూటీ.. పేలుతున్న సెటైర్లు!

Sun May 22 2022 11:00:01 GMT+0530 (IST)

Actress Srinidhi Shetty

సైలెంట్ గా వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ చిత్రం `కేజీఎఫ్`. ఇంతకుముందు కన్నడ సినీ పరిశ్రమను అందరూ చిన్న చూపు చూసేవారు. కానీ `కేజీఎఫ్` ఎప్పుడైతే విడుదలైందో అప్పటి నుంచీ లెక్కలన్నీ మారిపోయాయి. సౌత్ తో పాటు నార్త్ ను షేక్ చేసిన ఈ చిత్రం కన్నడ సినీ పరిశ్రమ ఖ్యాతిని తారా స్థాయికి తీసుకెళ్లింది. శాండిల్‌వుడ్ లో మాత్రమే స్టార్ హీరోగా ఉన్న యశ్ ఈ మూవీతో పాన్ ఇండియా స్థార్ గా మారాడు. అలాగే ఇటువంటి భారీ చిత్రంతో సినీ కెరీర్ ను ప్రారంభించిన శ్రీనిధి శెట్టి.. తొలి ప్రయత్నంలోనే అన్ని భాషల్లోనూ పాపులారిటీని సంపాదించుకుంది.కేజీఎఫ్ రెండు పార్టుల్లోనూ శ్రీనిధి శెట్టి కనిపించేది తక్కువ సన్నివేశాల్లోనే అయినప్పటికీ.. కావాల్సినంత క్రేజ్ స్టార్ డమ్ ను ఆమె సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు అన్ని వైపుల నుంచీ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. కానీ శ్రీనిధి మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఇకపోతే తాజాగా శ్రీనిధి శెట్టి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అక్కడ అడిగిన అన్ని ప్రశ్నలకు ఆమె ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది.

తాను అభిమానించే నటీనటులు యశ్ విక్రమ్ బాలీవుడ్ నటి మధుబాల అని డ్రీమ్ రోల్ అంటూ ఏమీ లేదని.. అన్ని రకాల పాత్రలూ పోషించాలని ఉందంటూ శ్రీనిధి శెట్టి పేర్కొంది. తన ఫస్ట్ లవ్ అమ్మే అని అమ్మతో గడిపిన ప్రతిక్షణం తనకు అపురూపమే అని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే ఎదుటి వ్యక్తిలో తాను మొదటగా కళ్ళనే గమనిస్తానని కళ్ళను చూడగానే ఓ అభిప్రాయానికి వచ్చేస్తానని శ్రీనిధి తెలిపింది.

ఇక ఈ క్రమంలోనే యాంకర్ `పేరు ప్రఖ్యాతలు కావాలా? డబ్బు కావాలా?` అని ప్రశ్నించగా.. అందుకు శ్రీనిధి శెట్టి ఎలాంటి మొహమాటం పడకుండా `నాకు మాత్రం డబ్బే కావాలి` అంటూ బోల్డ్ అన్సర్ ఇచ్చింది. దీంతో ఆమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లు ఆమెపై సెటైర్లు పేలుస్తున్నారు. పేరు ప్రఖ్యాతలు లేకపోయినా నీకు డబ్బే కావాలా అంటూ శ్రీనిధి శెట్టిపై ఫైర్ అవుతున్నారు.

అయితే మరో వర్గం వారు మాత్రం.. శ్రీనిధికి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. `ఈ ప్రపంచంలో ప్రతి దానికీ డబ్బే కావాలి. పేరు ప్రఖ్యాతలు ఏమైనా ఆకలిని అవసరాలను తీరుస్తాయా..? డబ్బు ఉంటేనే మనిషి ఏదైనా ఏమైనా చేయగలడు.` అంటూ శ్రీనిధి శెట్టిని సమర్థిస్తున్నారు.