శర్వా పక్కన ఛాన్స్ కొట్టేసిన బూరెబుగ్గల సుందరి...?

Wed Jul 08 2020 14:20:49 GMT+0530 (IST)

Actress Raashi Khanna Teams Up With Sharwanand For The First Time

రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన డైరెక్టర్ అజయ్ భూపతి 'Rx 100' సినిమాతో తన మార్క్ చూపించాడు. ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన అజయ్ భూపతి రెండో సినిమా మాత్రం ఇంతవరకు స్టార్ట్ చేయలేకపోయాడు. అప్పటి నుంచి తన రెండో సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లే ప్లాన్ లో ఉన్నారు అజయ్. దీనికోసం 'మహా సముద్రం' అనే స్టోరీని సిద్ధం చేసుకున్న అజయ్.. ఆ సినిమాలో హీరోల కోసం వెతుకులాట స్టార్ట్ చేసారు. అజయ్ భూపతి ఇప్పటికే ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరికీ ఈ స్టోరీ వినిపించాడట. మల్టీస్టారర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో చివరికి ఒక హీరోగా శర్వానంద్ ని ఫైనలైజ్ చేసుకున్నాడట. దీనికి సంభందించిన అధికారిక ప్రకటన రానప్పటికీ శర్వా నే హీరో అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.అంతేకాకుండా ఈ సినిమాలో శర్వానంద్ కి జోడీగా ముద్దుగుమ్మ రాశీఖన్నా ని తీసుకోవాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయిందట. 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రాశీఖన్నా.. ఫస్ట్ సినిమాతోనే తెలుగువారి హృదయాలను దోచుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతూ టాలీవుడ్ లో పాగా వేసుకు కూర్చుంది ఈ బూరెబుగ్గల సుందరి. ఈ క్రమంలో గతేడాది 'వెంకీమామ' 'ప్రతిరోజూ పండగే' చిత్రాలతో మంచి విజయాలను అందుకుంది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో రిలీజైన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా తర్వాత మరో తెలుగు సినిమా కమిట్ అవలేదు రాశీ ఖన్నా. నిజానికి విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' మూవీపై రాశీ భారీ ఆశలే పెట్టుకుంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది.

ఇక అమ్మడు టాలీవుడ్ నుంచి దూరం అయ్యే పరిస్థితి వచ్చిందని అందరూ అనుకున్నారు. ప్రస్తుతం మూడు తమిళ్ ప్రాజెక్ట్స్ చేతిలో పెట్టుకున్న రాశీ తెలుగులో మాత్రం ఒక్క సినిమాలో కూడా నటించడం లేదు. ఈ క్రమంలో హీరో శర్వానంద్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసిందని ఫిలిం నగర్ సర్కిల్స్ లో డిస్కస్ చేసుకుంటున్నారు. మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించనున్నారని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకి సంభందించి పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది.