బాలీవుడ్ లో ప్రతి ఒక్కరికి కూడా కంగనాతో పెట్టుకోవాలంటే ఒకింత భయం. కేవలం సినిమా ఇండస్ట్రీ వారు మాత్రమే కాకుండా రాజకీయ రంగానికి చెందిన వారు కూడా కంగనా తో పెట్టుకునేందుకు ఒక అడుగు వెనక్కే వేస్తారు. ఆ మద్య ఏకంగా ముఖ్యమంత్రి కొడుకునే సంచలన వ్యాఖ్యలు చేసి రోడ్డుకు ఈడ్చినంత పని చేసిన విషయం తెల్సిందే. అందుకే కంగనా ఫైర్ బ్రాండ్ అయ్యింది.
కంగనా రనౌత్ తో విభేదాలు ఉన్నా.. వివాదం ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా మాట్లాడరు. అలాంటిది కంగనా రనౌత్ పై తీవ్ర స్థాయిలో ఒక నటి విమర్శలు గుప్పించింది. ఆమె చేసిన వ్యాక్యలు ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అంతే కాకుండా కంగనా సూపర్ హిట్ షో గా చెప్పుకున్న లాకప్ పై కూడా అనేక అనుమానాలు కలిగేలా చేసింది అంటూ బాలీవుడ్ లో చర్చ జరుగుతోంది.
ఫైర్ బ్రాండ్ పైనే ఫైర్ కురిపించిన నటి పేరు పాయల్ రోహత్గీ. ఆమె కంగనా రనౌత్ హోస్టింగ్ చేసిన లాకప్ షో లో రన్నర్ గా నిలిచింది. మొదటి నుండి కూడా ఆమె ఖచ్చితంగా విన్నర్ అయ్యే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. షో నిర్వాహకులు కూడా ఆమె కు విన్నర్ అయ్యే అర్హత మరియు అన్ని విధాలుగా అవకాశం ఉందని అన్నారు. కాని చివరకు అర్హుడు కాని వ్యక్తిని విన్నర్ గా చేశారు అంటూ పాయల్ రోహత్గీ ఆరోపించింది.
సల్మాన్ ఖాన్ కుటుంబం తో కంగనా రనౌత్ ఈద్ కు కలిసింది. ఆ సమయంలోనే ఆమె లాకప్ విన్నర్ గా మునావర్ ఫరూఖీ నిలవాలని భావించింది. ఆమె అనుకున్నట్లుగానే అన్ని అర్హతలు ఉన్న నన్ను కాకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని.. అమ్మాయిలను అవహేళనగా మాట్లాడుతూ బాధ్యత లేకుండా వ్యవహరించిన వ్యక్తి అయిన మునావర్ ను విజేతగా ప్రకటించిందని పాయల్ పేర్కొంది.