చిక్కుల్లో పడేసిన ఫొటోషూట్.. నటి అరెస్ట్!

Tue Sep 14 2021 15:00:56 GMT+0530 (IST)

Actress Nimisha poses for a photo on a traditional boat

ఈ రోజుల్లో సినీ సెలబ్రిటీలు.. టెలివిజన్ యాక్టర్స్ కి ఫొటో షూట్ లు అనేవి సర్వసాధారణంగా మారాయి. వీటి ద్వారా అభిమానుల్లో తమకున్న క్రేజ్ ని కాపాడుకుంటూ వస్తుంటారు స్టార్స్. సోషల్ మీడియా వేదికగా స్టార్స్ హీరోయిన్ లు.. క్రేజీ టెలివిజన్ యాంకర్స్.. ఇతర నటీనటులు షేర్ చేసే ఫొటో షూట్ లు వారికి మరిన్ని అవకాశాల్ని అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.దీంతో చాలా మంది స్టార్స్ కాస్ట్యూమ్స్ పరంగా ప్రయోగాలు చేస్తూ నెటిజన్స్ ని అభిమానుల్ని సర్ ప్రైజ్ చేస్తున్నారు. ఈ ప్రయత్నాల ద్వారా మరింత అటెన్షన్ ని క్రియేట్ చేయాలని మరింతగా తాము వైరల్ కావాలని చేస్తున్న ప్రయత్నాలు చాలా సందర్భాల్లో మంచి ఫలితాల్ని అందిస్తున్నా కొన్ని సందర్భాల్లో ప్రయోగాలు వికటించి విమర్శలతో పాటు అరెస్ట్ లకు కూడా గురవుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది.

కొన్ని రోజుల క్రితం ప్రముఖ మలయాళ టెలివిజన్ సీరియల్ నటి నిమిషా ఓ సాంప్రదాయ పడవలో తను ఫొటోలకు పోజులిచ్చిన ఫోటోలను పోస్ట్ చేసింది. పంబా నదిలో ఊరేగింపు కోసం అరణ్ముల దేవాలయం నిర్మించి ఉపయోగించే ఒక ఉత్సవ పడవ ఇది. దీన్ని గమనించకపోవడంతో ఆమెకు తాజాగా గట్టి షాక్ తగిలింది. ఆలయ విశ్వాసాల ప్రకారం మహిళలు పడవలో అడుగు పెట్టడానికి అనుమతించబడరు అలాగే పాదరక్షలు ధరించడం నిషేధం.

తన ఫొటోల కారణంగా నిమిషా సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటోంది. ``పల్లియోదంలో అడుగు పెట్టడం తప్పు అని నాకు తెలియదు. ఇది కేవలం ఆలయ ఆచారాల కోసం ఉద్దేశించబడింది కాబట్టి నేను వెంటనే ఫోటోలను తొలగించాను. కానీ అప్పటి నుండి నేను బెదిరింపులకు గురవుతూనే ఉన్నాను` అని ఆమె మీడియాతో అన్నారు. తన కుటుంబ సభ్యులను కూడా విడిచిపెట్టడం లేదని ఆమె వాపోయారు. ఇదిలా వుంటే పుతుకులంగర పల్లియోడ సేవా సమితి ఫిర్యాదు ఆధారంగా తిరువళ్ల పోలీసులు నిమిషా.. ఆమె స్నేహితుడిపై ఐపిసి సెక్షన్ 153 (అల్లర్లకు ఉద్దేశ్యపూర్వకంగా రెచ్చగొట్టడం) కింద కేసు నమోదు చేశారు. శనివారం ఇద్దరిని అరెస్టు చేసి తర్వాత బెయిల్ పై విడుదల చేశారు.