Begin typing your search above and press return to search.

గరికపాటితో క్షమాపణ చెప్పించుకోవాలనే కోరిక మాకు లేదు: నాగబాబు

By:  Tupaki Desk   |   7 Oct 2022 3:31 PM GMT
గరికపాటితో క్షమాపణ చెప్పించుకోవాలనే కోరిక మాకు లేదు: నాగబాబు
X
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 'అలయ్ బలయ్' కార్యక్రమంలో గరికపాటి మాట్లాడుతుండగా.. స్టేజీ మీద పక్కనే చిరు అభిమానులతో ఫోటోలకు పోజులివ్వడంపై ఆయన ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనికి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా కౌంటర్ వేశారు.

''ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే..'' అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. తన సోదరుడి పై సీరియస్ అయిన గరికపాటిని ఉద్దేశించే నాగబాబు ఈ కామెంట్స్ చేశారని స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా గరికపాటి నరసింహారావుపై నాగబాబు మరోసారి స్పందించారు.

''గరికపాటి వారు ఏదో మూడ్ లో అలా అని ఉంటారు. ఆయన లాంటి పండితుడు అలా అనివుండకూడదని ఆయన అర్థం చేసుకోవాలి అని అన్నామే తప్ప.. ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు. ఏది ఏమైనా మన మెగాభిమానులు ఆయనని అర్థం చేసుకోవాలి గాని ఆయనని ఎవరు తప్పుగా మాట్లాడవద్దని మెగాభిమానులకు నా రిక్వెస్ట్'' అని నాగబాబు ట్వీట్ చేశారు.

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బండారు దత్తాత్రేయ 'అలయ్ బలయ్' కార్యక్రమం నిర్వహించగా.. దీనికి గరికపాటి నరసింహారావు మరియు సీనియర్ హీరో చిరంజీవి తో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అయితే గరికపాటి మాట్లాడేందుకు మైక్ తీసుకున్న సమయంలో చిరుతో ఫొటోలు తీసుకునేందుకు అక్కడున్న మహిళలు, యువతులు ఎగబడ్డారు.

అభిమానుల మనసు నొప్పించక చిరంజీవి వారితో ఫొటోలు దిగుతున్నారు. ఇది వేదిక మీద మాట్లాడుతున్న గరికపాటి అసహనానికి అసహనానికి గురయ్యేలా చేసింది. దీంతో గరికపాటి ఆగ్రహంతో చిరంజీవి గారు.. మీరు ఫొటో సెషన్‌ ఆపకపోతే కార్యక్రమం నుంచి వెళ్లిపోతా నాకు సెలవిప్పించండి అంటూ గట్టిగానే అన్నారు. కాసేపటికి చిరంజీవి రావడంతో శాంతించిన గరికపాటి.. తన ప్రసంగాన్ని కొనసాగించారు.

గరికపాటి తనపై అసహనం వ్యక్తం చేసినా.. చిరంజీవి మాత్రం ఆయనతో హుందాగా వ్యవహరించి దగ్గరకు వచ్చి పలకరించారు. గరికపాటి పక్కనే కూర్చొని ప్రసంగాన్ని ఆలకించడమే కాదు.. ఆయన్ని ప్రశంసించారు. త్వరలో తన ఇంటికి ఆయనను పిలుపుస్తానని చెప్పి తన గౌరవాభిమానాల్ని చాటుకున్నారు. అయితే ఒక సభా వేదిక మీద మెగాస్టార్ పై అలా మాట్లాడటం కరెక్ట్ కాదని మెగా ఫ్యాన్స్ మండిపడ్డారు.

దీనికి నాగబాబు ట్వీట్ కూడా తొడవ్వడంతో సోషల్ మీడియాలో గరికపాటి ని ట్రోల్ చేస్తూ పోస్టులు పెట్టారు. మెగా కాంపౌండ్ తో సన్నిహితంగా ఉండే పలువురు సినీ దర్శకులు - నటులు సైతం.. పరోక్షంగా ప్రవచనకర్తను టార్గెట్ చేస్తూ ట్వీట్లు పెట్టారు. ఈ క్రమంలో చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఒకరు గరికపాటికి ఫోన్ చేయడం.. చిరంజీవి తో మాట్లాడతానని ఆయన చెప్పినట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో గరికపాటితో క్షమాపణ చెప్పించుకోవాలని తమకు కోరిక లేదని నాగబాబు ట్వీట్ చేశారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.