Begin typing your search above and press return to search.

'గులాబీ' సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు పెద్ద ఇష్యూ జరిగింది!

By:  Tupaki Desk   |   19 Jan 2022 12:30 AM GMT
గులాబీ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు పెద్ద ఇష్యూ జరిగింది!
X
'అమ్మాయి కాపురం' అనే సినిమాతో 1995లో తెలుగు తెరకి మహేశ్వరి కథానాయికగా పరిచయమైంది. ఆ తరువాత జేడీ చక్రవర్తి జోడీగా ఆమె చేసిన 'గులాబీ' సంచలన విజయాన్ని సాధించింది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో, ఆమె యూత్ హృదయాలను ప్లోలోమంటూ కొల్లగొట్టేసింది. ఈ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ 'మేఘాలలో తేలిపొమ్మన్నది' మాదిరిగా కుర్రాళ్లంతా ఆమె ఊహలలో తేలిపోయారు. ఆ సమయంలో ఎక్కడ చూసినా అంతా మహేశ్వరి గురించే మాట్లాడుకున్నారు.

'పెళ్లి' .. 'దెయ్యం ' .. 'జాబిలమ్మ పెళ్లి' వంటి హిట్ సినిమాలు మహేశ్వరి ఖాతాలో కనిపిస్తాయి. ముఖ్యంగా వడ్డే నవీన్ సరసన ఆమె చేసిన 'పెళ్లి' సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. నటన పరంగా ఆమెకి ఎక్కువ మార్కులను తెచ్చిపెట్టిన సినిమా కూడా అదే. ఆ తరువాత ఆమె కొన్ని సినిమాలు చేసినప్పటికీ, ఆ స్థాయిని దాటి మాత్రం వెళ్లలేదనే చెప్పాలి. చాలాకాలం తరువాత ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమం కోసం కెమెరా ముందుకు వచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమో రన్ అవుతోంది.

ఈ వేదికపై మహేశ్వరి మాట్లాడుతూ .. " నాకు .. శ్రీదేవికి మధ్య గల అనుబంధం ఏమిటి అని విషయంలో చాలామందికి కన్ ఫ్యూజన్ ఉంది. ఆమె నాకు 'చిన్నమ్మ' అవుతుంది. నేను ఆమెను పప్పక్కా అని పిలిచేదానిని. నాకైతే ఆమె ఎక్కడో షూటింగులో ఉందనే ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది. ఆమె ఇక లేదని మేము అనుకోలేకపోతున్నాము. ఇక 'గులాబీ' సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని నేను ఊహించలేదు. ఆ సినిమాలో నా పాత్రకు నన్నే డబ్బింగ్ చెప్పమని కృష్ణవంశీగారు అన్నారు .. వర్మగారు కూడా అదేమాట చెప్పారు.

షూటింగు సమయంలో నేను ఎవరితోను ఎక్కువగా మాట్లాడేదానిని కాదు. దాంతో 'నీకు చాలా పొగరు' అని కొంతమంది నా ముఖానే చెప్పారు. నేనేదో రామ .. కృష్ణ అని ఒక పక్కన కూర్చుని ఉంటే, శ్రీదేవిగారి ఫ్యామిలీ నుంచి వచ్చింది కదా .. అందుకే అంత పొగరు అనుకున్నారు. కానీ నిజానికి అంత సీనే లేదు. 'గులాబీ' సినిమాలో 'మేఘాలలో తేలిపొమ్మన్నది' సాంగ్ చేస్తున్నప్పుడు పెద్ద ఇష్యూ అయింది. నాకు అసలే బైక్స్ పై వెళ్లడం అలవాటు లేదు. ఆ పాటలో ఎదురుగా ఒక మారుతి వ్యాన్ రావాలి. ఆ సమయంలో బైక్ స్కిడ్ కావడం .. లోయలోకి వెళ్లిపోవడం జరిగిపోయాయి" అని చెప్పుకొచ్చింది. ఆ తరువాత ఏం జరిగిందనేది పూర్తి ఎపిసోడ్ టెలీకాస్ట్ అయితేనే గానీ తెలియదు. అప్పటివరకూ ఈ సస్పెన్స్ ను భరించడమే!