హీరోతో పెళ్లిపై స్పందించిన హీరోయిన్!

Wed Jul 06 2022 10:01:45 GMT+0530 (India Standard Time)

Actress About Her Marriage with Hero

సినిమా ప్రపంచం దూరం నుంచి చూడటానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడి ప్రేమలు .. పెళ్లిళ్లను గురించి తెలుసుకోవడానికి బయట ప్రపంచం ఆసక్తిని కనబరుస్తూ ఉంటుంది. అందువల్లనే ఇక్కడ గాసిప్స్ ఎక్కువగా హల్ చల్ చేస్తుంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్ ఇక్కడ గాసిప్స్ బారిన పడకుండా ఉండటం చాలా కష్టం. అలా ఈ మధ్య లావణ్య త్రిపాఠిపై కూడా ఒక ప్రచారం జరిగింది.  ఒక హీరోతో ఆమె పెళ్లి జరిగిపోయిందంటూ చెప్పుకున్నారు. తన తాజా  చిత్రమైన 'హ్యాపీ బర్త్ డే' ప్రమోషన్స్ లో ఆమె ఈ విషయాన్ని ప్రస్తావించింది."నేను ఒక హీరోను పెళ్లి చేసుకున్నాననీ .. ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచుతున్నాననే టాక్ వచ్చింది. అందులో ఎంతమాత్రం నిజం లేదు. నేను  పెళ్లి చేసుకోలేదు .. ప్రస్తుతం దాని గురించి ఆలోచించడం లేదు.

ప్రస్తుతం నేను నా కెరియర్ పైనే దృష్టి పెట్టాను. పెళ్లి చేసుకునే సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేసుకుంటాను .. అప్పుడు అందరితో చెప్పే చేసుకుంటాను .. ఇదేం దాచవలసిన విషయం కాదే. సమయం వచ్చినప్పుడు ఈ విషయం పై  స్పందించవచ్చనే వెయిట్ చేశాను. అందుకే ఈ విషయంలో ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాను.

ఇక 'హ్యాపీ బర్త్ డే' సినిమా విషయానికి వస్తే .. ఈ సినిమాలో నేను 'హ్యాపీ' అనే పాత్రలో కనిపిస్తాను. 'అందాల రాక్షసి' తరువాత మళ్లీ ఇంత కాలానికి నేను టైటిల్ రోల్ చేసిన సినిమా ఇది. ఇది సర్రియల్ కామెడీ నేపథ్యంలో నడుస్తుంది. అందువలన ఇక్కడ సాధ్యాసాధ్యాల ప్రస్తావన ఉండదు .. లాజిక్ గురించి ఆలోచన చేయడం ఉండదు. అంతా కూడా ఒక ఊహాజనితమైన ప్రపంచంలో జరుగుతుంది. ఈ తరహా పాత్రలను ఇంతవరకూ చేయలేదు. లావణ్య కూడా కామెడీ చేయగలదని ఈ సినిమా నిరూపిస్తుంది.

స్టార్ హీరోయిన్స్ రేసులో లేకపోయినందుకు నేనేమీ బాధపడటం లేదు. నాలో టాలెంట్ ఉండటం వల్లనే పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాననే సంతృప్తి ఉంది. నాకు రావలసినంత గుర్తింపు రాలేదనే అనుకుంటున్నాను .. ఎక్కడో ఏదో లోపం జరిగిందనే భావిస్తున్నాను.

నా ఫస్టు సినిమాను రాజమౌళి గారి ప్రెజెంట్ చేశారు .. మళ్లీ ఆయన ఈ సినిమా ఫంక్షన్ లో నా గురించి మాట్లాడటం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ నెల 8వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది" అంటూ చెప్పుకొచ్చింది.