Begin typing your search above and press return to search.

అఖండ సక్సెస్ అయితే 'క్యూ' ఖాయం

By:  Tupaki Desk   |   11 Sep 2021 5:30 AM GMT
అఖండ సక్సెస్ అయితే క్యూ ఖాయం
X
యాక్షన్‌ చిత్రాల బ్రాండ్‌ అంబాసిడర్ అంటూ పేరు దక్కించుకున్న బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలకృష్ణ తో అఖండ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. వచ్చే నెలలో దసరా కానుకగా సినిమాను విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అఖండ విడుదల తేదీ విషయంలో ఒకటి రెండు రోజుల్లోనే స్పష్టత ఇస్తారని తెలుస్తోంది. అఖండ సినిమా విడుదల తర్వాత బోయపాటి మళ్లీ బిజీ అవుతాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది. అఖండకు ముందు రామ్‌ చరణ్‌ తో వినయ విధేయ రామ సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా తర్వాత యంగ్‌ హీరోలు పలువురు ఈయన దర్శకత్వంలో నటించేందుకు కాస్త వెనుకడుగు వేశారు. కాని అఖండ సక్సెస్‌ అయితే మాత్రం మళ్లీ బోయపాటి ముందు యంగ్‌ హీరోలు స్టార్‌ నిర్మాతలు క్యూ కట్టడం ఖాయం అంటూ నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటికే అఖండ పై నమ్మకంగా ఉన్న వారు బోయపాటితో సినిమాకు సిద్దం అవుతున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం యంగ్‌ హీరో అల్లు అర్జున్‌ మరోసారి బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడట. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే సినిమా వచ్చింది. అది మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. బోయపాటి ఆ సినిమా లో అల్లు అర్జున్‌ ను చూపించిన మాస్‌ రేంజ్ లో మరే దర్శకుడు కూడా చూపించిన దాఖలాలు లేవు. అందుకే మళ్లీ కూడా ఆయన దర్శకత్వంలోనే సినిమాను చేయాలని బన్నీ భావిస్తున్నాడట. ప్రస్తుతం చేస్తున్న పుష్ప పార్ట్‌ 1 తర్వాత వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఐకాన్‌ సినిమాను బన్నీ చేయబోతున్నాడు. ఆ తర్వాత పుష్ప 2 ను చేయబోతున్నాడు. వచ్చే ఏడాది చివరి వరకు పుష్ప 2 విడుదలకు సిద్దం అవుతుంది. అప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా ఉంటుందేమో చూడాలి.

బాలయ్య.. ప్రగ్యా జైస్వాల్ జంటగా నటించిన అఖండ సినిమా తో బోయపాటి తన మార్క్ ను మళ్లీ చూపిస్తాడనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది. బాలయ్య ను ఈ సినిమాలో దాదాపుగా అఘోర గెటప్ లో బోయపాటి చూపించబోతున్నారు. సింహా మరియు లెజెండ్‌ వంటి బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్స్ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా అవ్వడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అందుకే అఖండ సినిమాను మరింత ప్రత్యేక శ్రద్ద పెట్టి మరీ సినిమాను తెరకెక్కించారు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. కనుక అఖండ సినిమా అశేష విషయాన్ని సొంతం చేసుకుంటుందని నమ్మకం వ్యక్తం అవుతోంది. అఖండ సినిమా సక్సెస్ అయితే బోయపాటి బ్యాక్ టు బ్యాక్‌ మూడు నాలుగు స్టార్‌ హీరోల సినిమాల ఆఫర్లు దక్కించుకోవడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.