చీటింగ్ కేసులో నటుడు అతడి భార్య అరెస్ట్

Tue Jan 24 2023 10:56:53 GMT+0530 (India Standard Time)

Actor and His Wife Arrested in Cheating Case

సినిమాలు.. టీవీ సీరియళ్లు.. వెబ్ సిరీస్ లలో అవకాశాలు కల్పిస్తామని మోసం చేసే మోసగాళ్ల ఎరకు చిక్కి ఎందరో లక్షల్లో చెల్లించి జేబులు కాల్చుకుంటున్న వైనం బయటపడుతోంది. ఇవి నిరంతరం మీడియాలో వినే వార్తలే. కానీ ఇవి అంతూ దరీ లేనివిగా కనిపిస్తున్నాయి. ఇలాంటి ఒక మోసం ఇప్పుడు ఫిలింనగర్.. కృష్ణానగర్ లో ప్రకంపనాలు పుట్టిస్తోంది.క్యారెక్టర్ రోల్స్ ఇస్తానని పలువురు నటీనటులను మోసం చేసిన కేసులో ఓ అనామక బాలీవుడ్ నటుడు అతడి భార్యను సోమవారం సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తులను మహారాష్ట్రకు చెందిన అపూర్వ అశ్విన్ అలియాస్ అర్మాన్ అర్జున్ కపూర్. అతడి భార్య నటాషా కపూర్ అలియాస్ నాజీష్ మెమన్ గా గుర్తించారు.

పోలీసుల కథనం ప్రకారం.. బిస్కెట్ కంపెనీ ప్రచార ప్రకటనలో తమ కుమార్తెకు పాత్ర ఇప్పిస్తానని హామీ ఇచ్చి రూ.14.12 లక్షలు తీసుకుని ఓ అమాయక దంపతులను మోసం చేశారు. బాధితురాలి కుటుంబం డిసెంబర్ లో కొండాపూర్‌లోని ఒక షాపింగ్ మాల్ లో మెమన్‌ను కలుసుకుంది. అక్కడ ఆమె మోడలింగ్ ఏజెన్సీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా పరిచయం చేసుకుంది. ఒక టీవీ యాడ్ లో తమ కుమార్తె కోసం మోడలింగ్ పాత్రలో వారికి ఆసక్తి ఉందా? అని ఆమె ఆరా తీసింది.

వివిధ బ్రాండ్ల ప్రమోషన్ల కోసం బుల్లితెర ప్రకటనలు ఫోటో షూట్ లలో మోడలింగ్ కోసం పిల్లలను ఎంపిక చేసుకుంటామని మెమన్ వారిని ఒప్పించాడు. అంతేకాదు కిడ్స్ కు ప్రముఖ తారల సినిమాల్లో అవకాశాలు లభిస్తాయని ఆమె వారికి చెప్పారు. మోసగాళ్లు దంపతులను ఒప్పించేందుకు మాల్ లో ర్యాంప్ షో నిర్వహించి తమ కూతురు పెద్ద బిస్కెట్ కంపెనీకి సంబంధించిన ప్రకటన షూట్ కి ఎంపికైందని ప్రకటించారు.

మొదట్లో రూ. 3.25 లక్షల రిఫండబుల్ కాషన్ డిపాజిట్ ను బదిలీ చేయాలని దంపతులను కోరగా వారు పంపారు. తర్వాత ఫొటో షూట్ పేరుతో వారి నుంచి మరో రూ.10.87 లక్షలు వసూలు చేసారు. చీటింగ్ జంట వాట్సాప్ ని మేనేజ్ చేసే ఒక వెబ్ సైట్ ను ఉపయోగించారు. అలాగే  రాజస్థాన్ కు చెందిన వ్యాపారుల ఖాతాలకు డబ్బును బదిలీ చేయమని కోరారు. ఈ మోసాల గుట్టు ఇప్పుడు పోలీసులకు చిక్కింది. దీంతో మోసగాళ్లను అరెస్టు చేసి పోలీసులు విచారిస్తున్నారు.

సదరు కాన్ మన్ నుంచి ల్యాప్ టాప్- నాలుగు మొబైల్ ఫోన్ లతో పాటు రూ.15.60 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి కేసుల్లో అపూర్వను ఇంతకుముందు కూడా ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ పోలీసులు అతనిపై నాలుగు కేసులు నమోదు చేశారు.

ఇకపోతే ఇటీవలే పలువురు నటీనటుల నుంచి డబ్బు గుంజేందుకు ప్రయత్నించిన ఒక మహిళ గురించి టీఎంటీఏయు ఆర్టిస్టుల సంఘంలో పులవురు తీవ్రంగా ఆరోపించారు. పాత్రలో అవకాశం కల్పించాక డబ్బు చెల్లిస్తామని పలువురు ఎదురు తిరగడంతో ఆవిడ పరారైందని కూడా తెలిసింది. ఇలాంటి ఘటనలు నిరంతరం వెలుగు చూస్తుండడం చూస్తుంటే ఈ రంగంలోకి ప్రవేశించే అమాయకులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడం తప్ప చేసేది ఏదీ లేదు!నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.