Begin typing your search above and press return to search.

పూరి పిలుపు కోసమే వెయిటింగ్: బర్నింగ్ స్టార్

By:  Tupaki Desk   |   16 May 2022 12:30 AM GMT
పూరి పిలుపు కోసమే వెయిటింగ్: బర్నింగ్ స్టార్
X
సంపూర్ణేశ్ బాబు పేరు వినగానే ఎవరికైనా సరే వెంటనే నవ్వొస్తుంది. ఆయన చేసిన స్పూఫ్ లను తలచుకుని .. తలచుకుని నవ్వుకుంటూ ఉంటారు. సహజంగానే సంపూర్ణేశ్ బాబులో మంచి సమయస్ఫూర్తి కనిపిస్తుంది. ఆయన ఆయా స్టేజ్ లపై మాట్లాడేటప్పుడు అది మనకి వినిపిస్తుంది. అలాంటి సంపూ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు. "అప్పుడే నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతుందంటే ఆశ్చర్యంగా ఉంది. కాలం అనేది కొవ్వొత్తిలా కరిగిపోయింది.

ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఏమీ అర్థం కాలేదు. కానీ నా జర్నీని ఇప్పుడు చూసుకుంటే నాకే ఆశ్చర్యం కలుగుతోంది. వెండితెరపై కాసేపు కనిపిస్తే చాలు అనుకుని సినిమాల్లోకి వచ్చినవాడిని. నా కోరిక నెరవేరుతుందో లేదో కూడా నాకు తెలియని రోజులివి. ఆ కోరిక నెరవేరినందుకు ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను హీరోగా మాత్రమే చేస్తానని అంతా అనుకుంటున్నారు. కానీ సపోర్టింగ్ రోల్స్ వచ్చినా నేను చేస్తూనే ఉన్నాను. 'కొబ్బరిమట్ట' తరువాత హీరోగా ఒక ఐదారు సినిమాలు ఒప్పుకున్నాను.

నేను ఈ ఐదారు సినిమాలను కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ముందుగా వాటిపై ఫోకస్ పెట్టాను. అందువలన ఈ సమయంలో వేరే సినిమాలలో అవకాశాలను గురించిన ఆలోచనలు చేయలేదు. ఇకపై ఇతర హీరోల సినిమాలలోను సపోర్టింగ్ రోల్స్ చేయడానికి రెడీగా ఉన్నాను. నాతో సినిమాలు అంటే తక్కువ బడ్జెట్ లో అయిపోతాయి. మినిమమ్ గ్యారెంటీ ఉంటాయి అనే ఉద్దేశంతోనే చేస్తున్నారు. పూరి జగన్నాథ్ గారంటే నాకు చాలా ఇష్టం. ఆయనను నా గురువులా నేను భావిస్తూ ఉంటాను.

పూరి జగన్నాథ్ గారు 'లోఫర్' సినిమా కోసం నన్ను అడిగారు. అప్పుడు నేను 'కొబ్బరిమట్ట' షూటింగులో ఉండటం వలన, చేయలేకపోయాను. సంపూతో చేయాలని ఆ సమయంలోనే ఆయన ఒక స్టేజ్ పై చెప్పారు. అలాంటి ఒక ఛాన్స్ కోసమే నేను ఎదురుచూస్తున్నాను. పూరి గారు అంత గొప్ప డైరెక్టర్ అయినప్పటికీ నేను ఎక్కడ కనిపించినా ఎంతో ఆత్మీయంగా పలకరిస్తారు. నా నటన చూసి మాత్రమే కాదు .. ఉన్న దాంట్లో ఇతరులకు సాయం చేయాలనే నా ఉద్దేశం నచ్చడం వలన కూడా నన్ను అభిమానించే వారు ఎక్కువ" అని చెప్పుకొచ్చాడు.