Begin typing your search above and press return to search.

బోయపాటి రిబ్బన్ కట్ చేశారంటే ఈ సినిమా హిట్టే: రామ్

By:  Tupaki Desk   |   1 July 2022 5:04 PM GMT
బోయపాటి రిబ్బన్ కట్ చేశారంటే ఈ సినిమా హిట్టే: రామ్
X
రామ్ హీరోగా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి 'ది వారియర్' సినిమాను నిర్మించారు. తమిళ దర్శకుడు లింగుసామి ఈ సినిమాను రూపొందించాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. పోలీస్ ఆఫీసర్ గా రామ్ నటించిన ఈ సినిమాలో ఆయన జోడీగా కృతి శెట్టి అలరించనుంది. నదియా కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బోయపాటి ముఖ్య అతిథిగా అనంతపురంలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు.

ఈ వేదికపై రామ్ మాట్లాడుతూ .. "అనంతపురంలో సినిమా ఫంక్షన్లు ఎక్కువగా జరగవట .. ఈ ఊళ్లో ఈ సినిమా ఫంక్షన్ పెడదామని మా వాళ్లు చెబితే ఓకే అన్నాను. హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి 6 గంటలు పట్టింది .. కానీ ఈ గ్రౌండ్ లోకి ఎంటరైన దగ్గర నుంచి స్టేజ్ వరకూ రావడానికే గంటపట్టింది. నాకు ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందని అంతా అంతా అడుగుతూ ఉంటారు .. ఆ ఎనర్జీ నాకు మీ నుంచే వస్తుంది. ఈ ఫంక్షన్ కి రిబ్బన్ కటింగ్ బోయపాటి గారి చేతుల మీదుగా జరిగింది కనుక సినిమా హిట్టే అనుకుంటున్నాను.

ముందుగా నేను మా డైరెక్టర్ లింగుసామి గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఇంతకుముందు ఈవెంట్ లో ఆయన మరిచిపోయిన వాళ్లందరినీ కవర్ చేసే పనిలో ఆయన గురించి చెప్పడం మరిచిపోయాను. ఆయన మంచి డైరెక్టర్ మాత్రమే కాదు .. మంచి మనసున్న మనిషి కూడా. ఈ సినిమాలో నా పాత్రను ఆయన చాలా గొప్పగా మలిచాడు. తెలుగులో చాలా సినిమాల్లోని సీన్స్ .. తమిళంలో ఆయన సినిమాల్లోని సీన్స్ చూసి ఇన్ స్పైర్ అయినవే. తెలుగు సినిమా అంటే ఎలా ఉంటుందో అనేది అనంతపురంలో చూశానని ఆయన అన్నారు. రిలీజ్ అయిన తరువాత అసలైన సినిమా చూపిస్తానని చెప్పాను.

తమిళ ట్రైలర్ డిజిటల్ రిలీజ్ చేసిన శివకార్తికేయన్ గారికి ఈ వేదిక ద్వారా థ్యాంక్స్ చెబుతున్నాను. దేవిశ్రీ ప్రసాద్ గారు ఇక్కడికి రాలేకపోయారు ఆయనకీ .. ఆది పినిశెట్టి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కృతితో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా ఈ నెల 14వ తేదీన విడుదలవుతోంది. అందరూ కూడా థియేటర్స్ కి వెళ్లి ఈ సినిమాను చూడండి" అంటూ ముగించాడు.